శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్య గొంతుకలై కదంతొక్కాలి

1 గంట క్రితం

pnm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ప్రగతిశీల భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- ఢిల్లీ ఉద్యమంపై 'పాన్ ఇండియా' స్టార్లు స్పందించకపోవడం బాధాకరం : సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి

- వాస్తవికతకు ప్రతిబింబాలు పిఎన్ఎం కళాకారులు : సినీ దర్శకులు ఉమామహేశ్వరరావు

- ఘనంగా ప్రారంభమైన పిఎన్ఎం రాష్ట్ర 11వ మహాసభ

ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్/కార్పొరేషన్/క్రైమ్ : కర్నూలు నగరంలోని ఎస్.సన్యాసిరావు-కె.పెంచలయ్య నగర్ (డైమండ్ ఫంక్షన్ హాలు) వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర 11వ మహాసభ శనివారం ఘనంగా ప్రారంభమైంది. సభా ప్రాంగణంలో తొలుత పిఎన్ఎం కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు సిబి మదిలేటి పతాకావిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు జగన్... అమరుల త్యాగాలను స్మరిస్తూ గీతాలాపన చేశారు. సభలో స్వాగత గీతం పాడారు. ప్రారంభ సభకు పిఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు.

సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ కార్పొరేట్, మతోన్మాద శక్తులు ప్రజాస్వామ్యంపై , భావప్రకటనా స్వేచ్ఛపై విశృంఖల దాడులు చేస్తోన్న తరుణంలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రజలను చైతన్యపరిచి పాలకులను ప్రశ్నించే విధంగా కార్యోన్ముఖులను చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాపోరాటాలకు మరింత అంకురార్పణ జరిగేందుకు ఢిల్లీలో జరిగిన ఉద్యమాలు నిదర్శనమన్నారు. ఫాసిజాన్ని, ఎమర్జెన్సీని ఎదిరించి ప్రజానాట్యమండలి పుట్టిందని గుర్తుచేశారు. దేశ రాజధానిలో జరుగుతున్న ఉద్యమాల్లో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, ఈ ఉద్యమాలపై ఎంతోమంది సామాజికవేత్తలు, నటులు స్పందిస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లోని 'పాన్ ఇండియా' స్టార్లు స్పందించకపోవడం బాధాకరమన్నారు. వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అన్నమాచార్యులు వంటి మహాకవులు, వాగ్గేయకారులు నాటి సమాజంలోని అసమానతలను తమ రచనల ద్వారా ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చారని వివరించారు. ఆనాడే రాముడు, వెంకటేశ్వరస్వామి లాంటి వారిని ప్రశ్నించారని, ఇప్పుడు సనాతనాన్ని, మతాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని అన్నారు. నేటి మెగాస్టార్ చిరంజీవి లాంటి నటులకు ఊతమిచ్చిన అల్లు రామలింగయ్య వంటి దిగ్గజాలు ప్రజానాట్యమండలి ద్వారానే నటులుగా ఎదిగారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై గొంతువిప్పుతున్న వారిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రజలు, ప్రజానాట్యమండలి కళాకారులపైనే ఉందన్నారు. సఫ్దర్ హష్మీ కళాకారునిగా చేసిన పోరాటాన్ని నేటితరం కళాకారులు అందిపుచ్చుకుని ప్రజాభ్యుదయ భావాలను ప్రచారం చేస్తున్న వారు 'రియల్ రెడ్ స్టార్‌లు' అని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మరింత అధ్యయనం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రశ్నపత్రాలను లీక్ చేసిన, రాముడి నిధులు దిగమింగిన, అభ్యుదయ రచయితలను, జర్నలిస్టులను హింసించి చంపిన పాలకుల పాప ప్రక్షాళనకు ప్రజలు సిద్ధమవుతున్నారని, చెవిటి వాళ్లకు వినపించేలా బిగ్గరగా మాట్లాడుతామని భగత్ సింగ్ చెప్పినట్లుగా పిఎన్ఎం మహాసభ ద్వారా పాలకుల తప్పులను ప్రశ్నిస్తామని ప్రతినభూనాలన్నారు. సోషల్ మీడియాలాంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రజల్లోకి విస్తృతంగా పోవాలని పిలుపునిచ్చారు.

సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నేడు సమాజంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, కార్పొరేట్ శక్తులు కళారంగాన్ని తమ అబద్ధపు ప్రచారానికి వాడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో నిజాన్ని వెలికితీసే బలమైన ఆయుధంగా ప్రజానాట్యమండలి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవికతకు ప్రతిబింబంగా నిలబడిన వారే ప్రజానాట్యమండలి కళాకారులని పేర్కొన్నారు. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను ప్రతినిత్యం గమనిస్తూ ప్రజలకు పాటల, ఆటల రూపంలో వివరించాలని, అప్పుడే కళాకారులను సరైన గుర్తింపు వస్తుందన్నారు. సీనియర్ నటి డాక్టర్ ఎన్.విజయలక్ష్మి మాట్లాడుతూ అమ్మగా, అమ్మమ్మగా, పల్లెటూరి పెద్దగా వంద సినిమాల్లో నటించానని, దీనికి ఆనాటి ప్రజానాట్య మండలి పెట్టిన భిక్షేనని సగర్వంగా చెప్పారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు జి.పుల్లయ్య అధ్యక్షోపన్యాసం చేస్తూ కర్నూలు జిల్లాకు సాంస్కృతిక ఉద్యమంలో ఘనమైన చరిత్ర ఉందని, చెక్కభజనలు, తోలుబొమ్మలాట, రంగస్థల నాటికల ద్వారా ఎన్నో ఉద్యమాలు నడిపిన గడ్డపై ఈ మహాసభ జరగడం ఆనందకరమన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని, కళల ద్వారా ప్రజలకు భావాలను చేరవేయడం సులభతరమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంచలయ్య సౌహార్థ్ర సందేశం ఇచ్చారు. అనంతరం పిఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ ప్రతినిధుల సభలో కార్యదర్శి నివేదిక ప్రవేశ పెట్టారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బలరాం, పిఎన్ఎం రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఇ.నాగరాజ్, కార్యదర్శులు డి.గౌస్ దేశాయ్, ఆనంద్ బాబు, ఉపాధ్యక్షులు జి.రమణ, పిఎన్ఎం కర్నూలు జిల్లా అధ్యక్షులు నోమేశ్వరి, తెలంగాణ ప్రజానాట్యమండలి కార్యదర్శి కట్టా నరసింహ, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన సుమారు 500 మంది కళాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్