- వీధి నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో ప్రముఖ సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి- కర్నూలు కల్చరల్, కర్నూలు క్రైమ్ : అబద్ధమే నిజంగా రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో నిజం కోసం, ప్రజల కోసం, జనం మనుగడ కోసం నిరంతరం కృషి చేస్తున్న కళాకారులు సామ్రాజ్యవాద విషసంస్కృతి పై తిరగబడాలని జాతీయ చలనచిత్ర అవార్డు, నంది అవార్డు గ్రహీత సి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి 11వ రాష్ట్ర మహాసభలో భాగంగా కర్నూలు నగరంలో గాదే సుబ్బారెడ్డి వేదికగా సఫ్దర్ హష్మీ ఓపెన్ థియేటర్ (షాట్) వీధి నాటకోత్సవాల ప్రారంభోత్సవం
సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. వర్తమాన సమాజం కులం, మతం, ప్రాంతంగా విభజించబడుతున్న ప్రస్తుత సందర్భంలో ప్రజలను ఐక్యత చేసేందుకు, మెరుగైన సమాజం నిర్మించేందుకు కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ తరహా కృషి మార్క్స్, లెనిన్ ఎప్పుడో చేశారని గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రధాన మీడియా పాలకుల చేతుల్లో ఉండేదని, ఇప్పుడు సోషల్ మీడియా కూడా పాలకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, మీడియా మొత్తం దాసోహమైందని విమర్శించారు. మనుషుల మీద, మనుషులు సృష్టించుకున్న సంపద మీద, శ్రమ మీద ఆధిపత్య సంస్కృతి కొనసాగుతోందని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కర్నూలు కెవి.సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కళలు దశాబ్దాల క్రితం గొప్పగా ప్రదర్శించబడేవని, మారుతున్న ఆధునిక సమాజం దృష్ట్యా కలలు దూరమయ్యాయన్నారు. గొప్ప సమాజాన్ని నిర్మించడంలో కళాకారులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి, ఐద్వా రాష్ట్ర నాయకులు పి.నిర్మల, పిఎన్ఎం జిల్లా నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.
కళాకారుల అత్యద్భుత ప్రదర్శనలు
సఫ్దర్ హష్మీ స్వయంగా రచించి ఢిల్లీ వీధుల్లో ప్రదర్శించిన హల్లా బోల్ నాటకాన్ని కాకినాడ జిల్లా కళాకారులు అత్యద్భుతంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. కర్నూలు కళాకారులు ప్రదర్శించిన 'నా చెమట చుక్క` పాటకు సందర్శకులు చప్పట్లతో హోరెత్తించారు. కర్నూలు జిల్లా ఐద్వా నాయకులు అలివేలు, శ్యామల, సుజాత బృందం చేసిన నృత్యం కన్నుల విందుగా, పల్నాడు జిల్లాకు చెందిన దొంగ బాబాల నాటకం ఆద్యంతం సందేశాత్మకంగా, హాస్యభరితంగా సాగాయి. నెల్లూరు జిల్లా వారి వేమన నృత్యరూపకం, ఏలూరు జిల్లా వారి స్వర్గంలో నరకం నాటకం, విశాఖ జిల్లా వారి సలసల నృత్యం, అంతపురం జిల్లా వారి రాయలసీమ రైతు నాటకం ఆద్యంతం కనువిందు చేశాయి. మధ్యమధ్యలో ప్రజానాట్యమండలి కళాకారుల నృత్యాలు, చిన్నారుల ఆటపాటలు అలరించాయి.
కళల వరద ప్రవాహంగా ప్రదర్శన
లేలేరా... కదిలిరా... ప్రజల గొంతుకై నిలబడరా...! అన్నట్లుగా ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శన సాగింది. డప్పుల దరువులు, గజ్జల మోతల సవ్వడులు, కోలాటాలు, చెక్కభజనలు, చిటికెల మోతలు, గురవయ్యల ఢమరుక నాదాలతో కర్నూలు నగరం అడుగడుగునా కళల వరద ప్రవాహమై కదంతొక్కింది. ప్రజానాట్యమండలి (పిఎన్ఎం) 11వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని శనివారం కర్నూలు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. రేడియో స్టేషన్ సమీపంలోని వై.జంక్షన్ నుంచి ప్రారంభమైన భారీ ప్రదర్శన.. బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా కర్నూలు రైతు మార్కెట్ వరకు కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీలో రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన కళాకారులు పెద్ద ఎత్తున వివిధ రకాల జానపద కళారూపాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. ప్రముఖ సినీ దర్శకులు సి.ఉమామహేశ్వరరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్, అధ్యక్షులు మంగరాజు, మహాసభ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఇ.నాగరాజు, కార్యదర్శి ఎండి.ఆనంద్ బాబు ఈ ప్రదర్శనను అగ్ర భాగన ఉండి ముందుకు నడిపించారు. చేతిలో ప్రజానాట్యమండలి జెండాలు, రెపరెపలాడే నీలి జెండాలతో నగర వీధులు నీలిమయంగా మారాయి. కోలాటంలో చిన్నారుల బుడిబుడి అడుగులతో సాగిన నృత్యాలు, గురవయ్యల ప్రదర్శనలు దారి పొడవునా వీక్షకుల మదిని దోచుకున్నాయి. ఉత్సాహభరితంగా సాగింది. కెవి సుబ్బారెడ్డి, తెలకపల్లి రవి, నిర్మల తదితరులు కూడా డప్పు వాయించి కళాకారులకు మద్దతు తెలిపారు.







కామెంట్‌లు (0)