సమగ్రశిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సైకోమెట్రిక్ టూల్ ద్వారా విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలు, కెరీర్ ఆకాంక్షలు, భావోద్వేగ స్థితిని శాస్త్రీయంగా అంచనా వేసి, వారికి సరైన సమయంలో సరైన కెరీర్ మార్గదర్శకత్వం, కౌన్సెలింగ్ అందించవచ్చునని సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపి), సైకోమెట్రిక్ టూల్ ప్రమాణీకరణపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌ను గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వారి మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ ప్రణాళికలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, పోటీ, ఆందోళన, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పాఠశాలలు విద్యాబోధనతో పాటు వారి మెంటల్ హెల్త్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సైకోమెట్రిక్ టూల్ శాస్త్రీయంగా, విశ్వసనీయంగా, విద్యార్థులకు అనుకూలంగా ఉండటంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సులభంగా అమలు చేసే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదనపు డైరెక్టర్ ఎంఆర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తున్న కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కార్యక్రమం విద్యా వ్యవస్థలో కీలక కార్యక్రమంగా నిలుస్తుందని అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో నిపుణులు అందించే సూచనలు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న కార్యక్రమానికి బలమైన పునాదిగా నిలుస్తాయని, ఉపాధ్యాయులు, కౌన్సెలర్లకు శిక్షణ, డిజిటల్ అసెస్‌మెంట్ వ్యవస్థ, పర్యవేక్షణ విధానాల రూపకల్పనలో ఉపయోగపడతాయని చెప్పారు.








కామెంట్‌లు (0)