ప్రజాశక్తి–అనంతపురం: తీవ్ర గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన 90 ఏళ్ల వృద్ధుడికి కిమ్స్ సవీరా ఆస్పత్రి వైద్యులు అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తాలూకా అగళి ప్రాంతానికి చెందిన వృద్ధుడు తీవ్ర గుండెపోటు లక్షణాలతో ఆస్పత్రికి వచ్చారు. అధిక వయసుతో పాటు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ఉండటంతో చికిత్స సవాల్‌గా మారింది. గుండెకు రక్తప్రసరణను వీలైనంత త్వరగా పునరుద్ధరించాల్సి ఉండగా, యాంజియోగ్రఫీలో ఉపయోగించే కాంట్రాస్ట్ డై మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. పర్వేజ్ నవాజ్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టెంట్ అమర్చింది. మూత్రపిండాలపై అదనపు భారం పడకుండా కాంట్రాస్ట్ డైను అత్యల్ప మోతాదులో వినియోగించారు. నెఫ్రాలజిస్టులు డా. బదరీనాథ్, డా. సమీర్ జాన్ సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. చికిత్స అనంతరం వృద్ధుడి ఆరోగ్యం మెరుగుపడటంతో స్థిరమైన పరిస్థితిలో డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు. అధిక వయసుతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గుండెపోటును సకాలంలో గుర్తించి తగిన చికిత్స అందిస్తే అత్యవసర గుండె చికిత్సలను విజయవంతంగా నిర్వహించవచ్చని డా. పర్వేజ్ నవాజ్ తెలిపారు. తీవ్రమైన గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని అత్యవసర వైద్య కేంద్రానికి తరలించాలని సూచించారు.
90 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా యాంజియోప్లాస్టీ
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)