- ఉపముఖ్యమంత్రి ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాలుష్యం వెదజల్లుతున్న ఆంధ్ర పేపర్ మిల్లు యాజమాన్యానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో సుమారు 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్ మిల్లు ఉత్పత్తి చేస్తుందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థ విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉందన్నారు. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికమని, ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు.. అంటే 6 శాతం అధికం, సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయని తెలిపారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే.. ఇది 70 శాతం అధికమన్నారు. సంస్థ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చని, అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిందన్నారు. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంస్థ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు. అయితే సంస్థ నుంచి స్పందన పూర్తిగా కొరవడిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.








కామెంట్‌లు (0)