- కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్‌తో మంత్రి బిసి జనార్థన్ రెడ్డి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో పోర్టులు, తీర ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బిసి జనార్థన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో మారిటైమ్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. శుక్రవారం నాడిక్కడ కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలశాఖ మంత్రి సర్భానందా సోనోవాల్‌తో మంత్రి బిసి జనార్థన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న కీలక మారిటైమ్ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో తీర ప్రాంత మౌలిక సదుపాయాల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, పోర్టు ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై మంత్రులు ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా మూలాపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అభివృద్ధిలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ భాగస్వామ్యాన్ని కల్పించాలని బిసి జనార్థన్ రెడ్డి కోరారు. అలాగే పోర్టు సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అవసరమైన ఉప్పు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌మాల పథకం కింద గంగవరం పోర్టు, అనకాపల్లి జిల్లాలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఎఎంఎన్ఎస్) పోర్టులకు అనుసంధాన రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సాగర్‌మాల 2.0 కింద ప్రతిపాదించిన ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, దుగ్గరాజపట్నం మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్, అంతర్గత జలమార్గాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె రామ్మోహన్‌నాయుడు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎమ్‌టి కృష్ణబాబు, ఎపి మారిటైమ్ బోర్డు సిఇఒ ప్రవీణ్ ఆదిత్య, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)