శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

​బలవంతంగా ఆసుపత్రికి.. సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌‌ తరలింపు

3 గంటల క్రితం

sonam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 01:13 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

- ప్రభుత్వ వైద్యుల ముసుగులో ఢిల్లీ పోలీసుల బరితెగింపు

- దీక్ష ప్రారంభించిన అభిజీత్ దీప్కే

- ఎస్‌ఎప్‌ఐ నిరవదిక నిరాహార దీక్ష

​ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వ కన్నుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులు శనివారం ఉదయం బరితెగించారు. తమను తాము ప్రభుత్వ వైద్యులమని చెప్పుకుంటూ జంతర్‌‌మంతర్‌ ‌వద్ద సోనమ్‌ ‌వాంగుచుక్‌ ‌ నిరాహార దీక్ష శిబిరంపై విరుచుకు పడ్డారు. 21 రోజుల దీక్షతో నీరసించి పోయి ఉన్న ఆయనను ఒక్కసారిగా చుట్టుముట్టారు. తెల్లని బెడ్‌‌షీట్‌‌ను వాంగ్‌‌చుక్‌ ‌ చుట్టు చుట్టి బలవంతంగా ఆసుప్రతికి తరలించారు. ఏం జరుగుతుందో అర్ధం చేసుకుని దీక్షా వేదిక మీద ఉన్న కొందరు ప్రతిఘటించడానికి ప్రయత్నించినప్పటికీ బలప్రయోగంతో వారిని అణచివేశారు. ఈ బలవంతపు తరలింపునకు కొంతముందే జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఫోన్లు పనిచేయకుండా జామర్లు పెట్టారు. దీంతో అక్కడ జరిగిన దౌర్జన్యకాండ బయట ప్రపంచానికి వెంటనే తెలియని పరిస్తితి ఏర్పడింది. వాంగుచుక్‌ ‌ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టు వ్యక్తం చేసిన ఆందోళనను సాకుగా చూపుతూ పోలీసులు తమ చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. నీట్ ప్రశ్నా పత్రం లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఆందోళన చేపట్టిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) కి మద్దతుగా పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌‌ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 21 రోజులకు దీక్ష చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా కూడా స్పందిచకపోవడం, మరోవైపు వాంగుచుక్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌‌కు దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన వస్తుండటం తదితర పరిణామాల్లో ఢీల్లీ పోలీసులు ఈ బరితెగింపు చర్యకు దిగడం చర్చనీయాంశంగా మారింది.వాంగ్‌‌చుక్‌‌ను ఆస్ప్రతికి తరలించడానికి నిరసన కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే జంతర్‌ ‌మంతర్‌ ‌వద్దే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎస్‌ఎఫ్ఐ కూడా నిరవధిక నిరాహార దీక్షకు దిగింది. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ నిరాహార దీక్షను ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌‌టిఎ)ను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ ‌చేసింది. శనివారం ఉదయం చోటుచేసుకున్న ఈ పరిణామాలతో శనివారం జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు, సినీ ప్రముఖులు ఖండించారు. పోలీసుల చర్య తరువాత, వేలాది మంది జంతర్ మంతర్‌కు తరలివచ్చారు.

​ప్రణాళిక ప్రకారమే...

ఢిల్లీ పోలీసులు ప్రణాళిక ప్రకారమే దాడికి పూనుకున్నారు. జంతర్ మంతర్ వద్ద ముందే మొబైల్స్ పనిచేయకుండా ఫోన్ జామర్లను పెట్టారు. తాము ప్రభుత్వ వైద్యులమని చెప్పుకుంటూ పోలీసులు సుమారు ఉదయం 6.30 గంటలకు జంతర్ మంతర్‌కు చేరుకున్నారు. అయితే, తాము నియమించిన వైద్యులే వాంగ్‌చుక్‌ను పరీక్షిస్తారన, ఇతరులు అవసరం లేదని సిజెపి కార్యకర్తలు వారికి చెప్పారు. దీతో వారిని పక్కను నెట్టివేసి వేదికపైకి పోలీసులు దూసుకువెళ్లారు వాంగ్‌చుక్‌పై తెల్లటి బెడ్‌‌షీట్‌ ‌కప్పి, అంబులెన్స్‌లోని స్ట్రెచర్‌పై ఎక్కించి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. తమతో ఏ మాత్రం సంప్రదించకుండానే పోలీసులు ఈ చర్యకు దిగారని

వాంగ్‌‌చుక్‌ భార్య గీతాంజలి ఆంగ్మో అన్నారు. శుక్రవారం 4.3గా ఉన్న వాంగ్‌చుక్ పొటాషియం స్థాయిని, శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పరీక్షించగా అది 2.9గా తేలిందని, దీనిపై అనుమానం ఉందని ఆమె అన్నారు. మరో ల్యాబ్‌‌లో పరీక్ష చేయడానికి వారు అనుమతించలేదని ఆంగ్మో తెలిపారు. తనఅనుమతి లేకుండా తన భర్తకు ఎటువంటి చికిత్స అందించ వద్దని ఆమె డిమాండ్‌ ‌చేశారు.

​అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష

​ వాంగ్‌చుక్ అరెస్టు అనంతరం, సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయన నిరసనకారులకు అభివాదం చేస్తుండగా, సంఘ్ పరివార్ మద్దతుదారుడు ఒకరు అభిజీత్‌పై సిరా చల్లారు. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్ష ప్రారంభించిన విద్యార్థి కార్యకర్తలు కూడా జంతర్ మంతర్ వద్ద కొనసాగిస్తున్నారు. పోలీసులు తనను కూడా కొట్టారని ఆయన చెప్పారు.

​హైకోర్డు ఆదేశాలను ఉల్లంఘించారు : సౌరవ్‌ ‌వాస్‌

​హైకోర్టు ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించిందని, అంతే తప్ప ఆయనను ఎత్తుకెళ్లమని చెప్పలేదని సిజెపి నేత సౌరవ్ దాస్ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను ఢిల్లీ పోలీసులు ఉల్లంఘించారని విమర్శించారు. గత రోజులకు భిన్నంగా, శనివారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించారు. నిరసనను అణచివేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం సీనియర్ ఐపిఎస్ అధికారి అనురాగ్ కుమార్‌ను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఈ పదవి నుంచి సతీష్ గోల్చాను తొలగించారు. ఈ మార్పు వెనుక ప్రధాని మోడి ఉన్నారని ఆప్ ఆరోపించింది.

​ఎస్‌ఎఫ్‌ఐ దీక్ష ప్రారంభం

సోనమ్ వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా జంతర్ మంతర్ వద్ద ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్షను ప్రారంభించింది. అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ నిరాహార దీక్ష చేస్తున్నారు. వాంగ్‌చుక్‌ను విడుదల చేసే వరకు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తామని వారు ప్రకటించారు. వీరిద్దరూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఉన్న ఎస్ఎఫ్ఐ నిరసన కేంద్రం 'క్రాంతి కార్నర్' వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. విద్యా రంగంలో వైఫల్యానికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. వాంగ్‌చుక్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ తన యూనిట్లకు పిలుపునిచ్చింది. “ఇది భారతదేశ భవిష్యత్తును కాపాడే పోరాటం. పోలీసులు ఎంత అణచివేయడానికి ప్రయత్నించినా, మేము అంగుళం కూడా వెనక్కి తగ్గము. దేశవ్యాప్తంగా వందలాది క్రాంతి కార్నర్‌లను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నిర్ణయించింది. ఈ ప్రదేశాలలో నిరవధిక సమ్మె ప్రారంభించబడుతుంది. ఇతర విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా ఇందులో చేరతాయని భావిస్తున్నాము. మేము బలంగా ముందుకు సాగుతాము” అని ఆదర్శ్ ఎం సాజి అన్నారు.‘శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తూ, కనీసం కదలలేని స్థితిలో ఉన్న, నిశ్శబ్దంతో న్యాయం కోరుతున్న వ్యక్తిని పోలీసులు అపహరించారు. ఒక్క వాంగ్‌చుక్‌ను అడ్డుకుంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ లక్షలాది మంది ముందుకు వస్తారు" అని ఐషీ ఘోష్ అన్నారు.

పోలీసులు దారుణంగా వ్యవహరించారు : ఎంఎ బేబీ

సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ కింద పనిచేసే ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ ‌షా, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ ‌భగవత్‌లు ధర్మేంద్ర ప్రదాన్‌‌ను రక్షించడం కొనసాగిస్తే వారు తమను తాము కాపాడుకోలేరని అన్నారు. సోనమ్ వాంగ్ చుక్ వద్దకు అనుమతించలేదని, ఎంపిలు పోలీసులతో వాదించినప్పటికీ అనుమతించటం లేదని అన్నారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రి డైరెక్టర్ అనుమతి తీసుకుకోవాలని పోలీసులు అన్నారని, ఆసుపత్రి డైరెక్టర్ కవిత రాణి శర్మతో మాట్లాడామని, ఆమె రిపోర్టులు చూపించారని తెలిపారు. సోనమ్ వాంగ్ చుక్ ను బలవంతంగా ఎత్తుకు పోవటాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్