బాధిత రైతులకు చెక్కులు అందజేత
ప్రజాశక్తి - గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి రైతు సేవా కేంద్రం (ఆర్‌ఎస్‌కె)లో జరిగిన అవినీతిపై కౌలు రైతు సంఘం చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో తాము విక్రయించిన ధాన్యానికి సంబంధించిన నగదు... అధికారుల నిర్లక్ష్యం, ఆర్‌ఎస్‌కె నిర్వాహకుల అవినీతి కారణంగా పక్కదారి పట్టడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కౌలు రైతు సంఘం నాయకుల సహకారంతో బాధితులు ఆరు రోజులపాటు నిరసన దీక్షలు చేపట్టారు. ఆరో రోజు ఆర్‌ఎస్‌కె ను ముట్టడించి తాళం వేశారు. ఈ నేపథ్యంలో రైతుల నిరంతర పోరాటం ఫలితంగా అధికారులు దిగివచ్చారు. బాధితులకు శుక్రవారం డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, రోడ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు శివశంకర్, తహశీల్దార్ శివయ్య చేతుల మీదుగా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం రాష్ట్ర కోశాధికారి సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.వి.లక్ష్మణస్వామి, మండల కార్యదర్శి కైలే ఏసుదాసు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లంపల్లి ఆంజనేయులు, కళ్ళం రాంబాబు, సిఐటియు నాయకులు బెజవాడ తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు నాగులు, సోమిశెట్టి కాళేశ్వరరావు, శంకరరావు మాట్లాడుతూ... కౌలు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమకు ఆర్‌ఎస్‌కె అవినీతి వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాలేదని, కౌలు రైతు సంఘం అండగా నిలిచి పోరాడటంతోనే తమ పంట డబ్బులు చేతికి అందాయని తెలిపారు.








కామెంట్‌లు (0)