- పాఠశాల విద్య కమిషనర్‌కు యుటిఎఫ్ వినతి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో సిలబస్, మార్కులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను యుటిఎఫ్ కోరింది. కమిషనర్ తమీర్ అన్సారియా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల సమావేశం పాఠశాల విద్యాశాఖ కార్యాలయం విద్యభవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ 2011 కంటే ముందే నియామకం పొందిన ఉపాధ్యాయులే కాకుండా ఇన్ సర్వీస్ టీచర్లందరికీ ప్రత్యేక టెట్ రాసుకునేలా అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక టెట్ నిర్వహణకు విడుదల చేసిన మెమోలో సవరణ చేయాలని కోరారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టులలోనే పరీక్ష నిర్వహించాలని కోరారు. సిలబస్, మార్కులు తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఎపిటిఎఫ్ రెండు సంఘాలు, ఆప్టా, ప్రధానోపాధ్యాయుల సంఘం తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)