మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటు చోరీపై ఐక్య పోరాటం

1 గంట క్రితం

ma babay india bloc meetimng.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:58 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

  • ఇండియా బ్లాక్‌ నేతల భేటీలో నిర్ణ‌యం

  • విద్యార్థి సంఘాలు, పౌరసమాజ ప్రతినిధులతోనూ చర్చలు

​ప్ర‌జాశ‌క్తి - న్యూఢిల్లీ బ్యూరో : ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఇండియా బ్లాక్ స‌మావేశం నిర్ణయించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నివాసంలో మంగళవారం ఇండియా బ్లాక్ నేత‌ల స‌మావేశం జ‌రిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమాన్ని కొనసాగించాలని నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్‌జెడి నేతలు తేజస్వి యాదవ్‌, మనోజ్‌ ఝా, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎం ఎ బేబీ, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, పి సంతోష్‌ కుమార్‌, సిపిఐ ఎంఎల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దీపాంక‌ర్ భ‌ట్టాచార్య‌, ఫార్వ‌ర్డ్ బ్లాక్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవ‌రాజ‌న్‌, ఆర్ఎస్‌పి ఎంపి ఎన్‌కె ప్రేమ్ చంద్ర‌న్‌, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌, జెఎంఎం నేత మ‌హువా మాంఝీ, విసికె ఎంపి తిరుమ‌వ‌ల‌య‌న్‌, టిఎంసి ఎంపి సాగ‌రిక ఘోష్‌, కేర‌ళం కాంగ్రెస్ ఎంపి మ‌ణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపి హ‌రేంద్ర మాలిక్‌ తదితరులు హాజరయ్యారు. ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా బోరా, ఎస్ఎఫ్ఐ అఖిల భారత స‌హాయ కార్య‌ద‌ర్శి ఐషీ ఘోష్‌, ఇత‌ర‌ విద్యార్థి సంఘాల నేత‌లు, ప్ర‌ముఖ న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌న్‌, సామాజిక కార్య‌క‌ర్త యోగేంద్ర యాద‌వ్ త‌దిత‌ర‌ పౌరసమాజ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

​జ్ఞానేష్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో అందరూ ఐక్యంగా ఉన్నామన్నారు. ‘‘ దేశంలో ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ నాశ‌నం చేశారు. మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్‌కు ఉచ్చు బిగుస్తోంది. దేశంలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింది. ధ్వంస‌మైన ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌ట‌మే మా ల‌క్ష్యం’’ అని అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థ పట్ల తమకు అత్యంత గౌరవం ఉందన్నారు. అయితే, తాము ఆగిపోమని, అంతిమ లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడతా మన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఇండియా బ్లాక్‌ అంతా ఒక్కటిగా నిలిచిందన్నారు. ‘‘ఎన్నికల వ్యవస్థ నిర్వీర్యం చేశారు. రాజ్యాంగం చిరిగిపోయింది. ప్రజాస్వామ్య వ్యక్తీకరణకు వేదికైన జంతర్ మంతర్ వద్ద నిరసనలను ప్రభుత్వం అడ్డుకుంది. మేము ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తాము. మోడీ ప్రధాన వాస్తుశిల్పి, అమిత్ షా అమలుకర్త, జ్ఞానేష్ కుమార్, ఇతరులు వారికి సహకరిస్తున్నారు. తమ చుట్టూ నెట్ మూసుకుంటోందని వారు అర్థం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి తప్పించుకోలేరు. మోడీ, షా, జ్ఞానేష్ కుమార్, ఇతరులతో సహా బాధ్యులను చేస్తామని ప్రజలకు మా వాగ్దానం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

​​ఇండియా బ్లాక్ కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి : ఖర్గే

రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ తమ పోరాటం విజయవంతమైందని, సుప్రీంకోర్టుకు ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ సంఖ్యలో యువత పాల్గొన్నారన్నారు. ‘ఇండియా బ్లాక్ నిర్వహించిన కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయని, ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి తాము కృషి చేస్తున్నామని అన్నారు.

​ప్రజాస్వామ్యాన్ని అపహరించారు : ఎంఎ బేబీ

ఈ మీడియా సమావేశంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మాట్లాడుతూ బిజెపి, సిఇసి ప్రజాస్వామ్యాన్ని అపహరించాయని విమర్శించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి (సిఇసి), అధికార పార్టీకి చెందిన బృందంతో చేరిపోయారన్నారు. ‘‘వీరు మొదట ఓట్లను దొంగిలించారు. ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహరించారు. ఇప్పుడు నిరసనల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా లాగేసుకున్నారు. ఈ ‘ఓట్ల దొంగల’కు వ్యతిరేకంగా ‘ఇండియా’ బ్లాక్ మొత్తం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుంది’’ అని బేబీ స్పష్టం చేశారు.

​​జంతర్ మంతర్ నిరసనలు తెలిపే ప్రదేశంగానే కొనసాగాలి : రాజా

సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం ఇప్పుడు జంతర్ మంతర్ హోదాను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జంతర్ మంతర్ అనేది ప్రజలు నిరసనలు తెలిపే ప్రదేశంగానే కొనసా గాలి’’ అని అన్నారు. ఆందోళనపై భయంతోనే జంతర్ మంతర్‌ను మూసివేశార‌ని విమ‌ర్శించారు.

​జ్ఞానేష్ కుమార్ ఒక కీలు బొమ్మ : తేజ‌శ్వీ యాద‌వ్

ఆర్‌జెడి నేత‌ తేజ‌శ్వీ యాద‌వ్ మాట్లాడుతూ సిఇసి జ్ఞానేష్ కుమార్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో శిక్ష త‌ప్ప‌ద‌ని, రాబోయే రోజుల్లో త‌మ పోరాటం మరింత దూకుడుగా సాగుతోంద‌న్నారు. మోడీ-షా ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా వ్యవహరించారని విమ‌ర్శించారు. ఆయన ఒక కీలుబొమ్మలా వ్యవహరించార‌ని, దీనికి ఆయన ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని, వీరు తప్పించుకోలేరని అన్నారు. ఈ పోరాటం ఏ ఒక్క వ్యక్తికో లేదా పార్టీకో పరిమితమైనది కాద‌ని, ఇది దేశ ప్రజాస్వామ్య విలువలు, ప్రతి పౌరుడి హక్కులకు సంబంధించిన పోరాటమ‌ని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా బ్లాక్‌లోని పార్టీలన్నీ ఏకమయ్యాయని అన్నారు.

అలాగే, ఎస్‌పి ఎంపి హ‌రేంద్ర మాలిక్ మాట్లాడుతూ న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో పార్టీలన్నీ ఐక్యంగా నిలుస్తాయని అన్నారు. ఎన్‌సిపి నేత సుప్రీయా సులే మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా బ్లాక్ పూర్తిగా ఏకమైంద‌న్నారు. శివసేన ఎంపి సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘జ్ఞానేష్ కుమార్ ఒక మాఫియా లాంటి వ్యక్తి. ఆయన మొత్తం వ్యవస్థనే నేరమయం చేశారు. గత 12 ఏళ్లుగా మోడీ, షా దేశాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఇప్పుడు భయపడాల్సిన వంతు వారిదే. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు కోసం ఈ పోరాటం కొనసాగుతుంది’ అని అన్నారు. అలాగే, టిఎంసి ఎంపి సాగరిక ఘోష్ మాట్లాడుతూ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల సంఘం కొనసాగుతున్నంత కాలం, దేశంలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు జరగడం అసాధ్యమని అన్నారు. అలాగే, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ మాట్లాడుతూ ‘నిరసన తెలపడం మా హక్కు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి మోడీ ప్రభుత్వం తన సర్వశక్తులనూ ఒడ్డినప్పటికీ, అది విఫలమైంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మేమంతా కలిసి ఈ పోరాటాన్ని సాగిస్తాం. విజయం సాధిస్తాం’ అని అన్నారు.

ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ ‘దేశ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఉన్న ఏకైక శత్రువు బిజెపి. ఓటర్ల హక్కులపై దాడి అంటే భారతదేశంపై, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. సిఇసి జ్ఞానేష్ కుమార్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలి. ఎస్ఐఆర్ ప్ర‌క్రియ విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తింది. దాన్ని ర‌ద్దు చేయాలి’ అని డిమాండ్ చేశారు.

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్