ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: టిడిపి చేపట్టిన ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమం 44.25లక్షలకు చేరింది. జులై 27న ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పటికీ 15 రోజులు పూర్తయిందని ఆ పార్టీ కార్యాలయం సోమవారం ఒక ప్రటకనలో తెలిపింది. సోమవారం ఒక్క రోజే 3.51లక్షల కుటుంబాలను టిడిపి శ్రేణులు కలిశారని తెలిపారు. టిడిపి శ్రేణులు 44.25లక్షల ఇళ్లను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజలకు వివరించారని వెల్లడించింది.ప్రజల అభిప్రాయాలు, స్థానిక సమస్యలను కూడా పార్టీ శ్రేణులు తెలుసుకుంటూ వాటిని సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని తెలిపింది. కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఎప్పటికప్పుడు సాంకేతికత ద్వారా కార్యక్రమ పురోగతిని సమీక్షిస్తున్నారని వెల్లడించింది.
సంక్షేమ విప్లవానికి చంద్రబాబు శ్రీకారం : బాలకోటయ్య
దేశంలోనే అతిపెద్ద సంక్షేమ విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని టిడిపి నేత పోతుల బాలకోటయ్య అన్నారు. టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 3 నుంచి 8 తేదీ వరకు సోషల్ వెల్ఫేర్ బోర్డు తరపున ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్ర చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేవలం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధిలపై దృష్టి సారించడమే కాకుండా సంక్షేమ హాస్టళ్ల స్థితిగతుల మీద కూడా దృష్టి సారించారని తెలిపారు.ముస్తాబు కార్యక్రమానికి ఆయన శ్రీ కారం చుట్టారని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)