ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మెయిల్ ద్వారా శుక్రవారం వినతిపత్రాన్ని పంపారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 13 వేల మంది నాన్ పిహెచ్ వర్కర్స్ దశాబ్దాల తరబడి కోటిన్నర మంది పట్టణ ప్రజలకు తాగునీరు, విద్యుత్, వెహికల్ డ్రైవర్లు, మెకానిక్‌లు, పార్క్‌లు, డిఇఒ, ఆఫీస్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్, బిల్ కలెక్టర్లు తదితర సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా, విజయవాడ వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల్లో మున్సిపల్ కార్మికులు తమ కుటుంబాలను వదిలి బాధితులకు రేయింబవళ్లు సేవలు అందించారన్నారు. వాస్తవానికి రూ.24,500 జీతం రావాల్సి ఉండగా, కార్మికులకు రూ.18,500 మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. దేశంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. చాలీచాలని జీతాలతో బతకలేక అవస్థలు పడుతున్న ఇంజినీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)