- జెవివి ‘స్టేట్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ’లో వక్తలు
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకత, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించే ఉత్తమ విద్యా వ్యవస్థ అవసరమని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండు రోజులపాటు విశాఖలో నిర్వహించిన స్టేట్ ఎడ్యుకేషన్ అసెంబ్లీ - 2026 ఆదివారంతో ముగిసింది. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో తలపెట్టిన ఈ అసెంబ్లీలో పలు అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. విద్యా రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు హాజరై నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి–2020) అమలుపై మాట్లాడారు. విద్యారంగంలో ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ జి.మధుకుమార్ మాట్లాడుతూ భారత ఐటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నప్పటికీ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డి)పై తగిన స్థాయిలో పెట్టుబడులు పెట్టడం లేదని, చైనా వంటి దేశాలు స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తుండగా భారత్ ఇప్పటికీ ప్రధానంగా అవుట్‌సోర్సింగ్ సేవలకే పరిమితమవుతోందని వివరించారు. విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిక సంఖ్యలో ఇంజనీరింగ్ కోర్సులవైపు మళ్లించడం వల్ల చదివిన విద్యకు సంబంధం లేని ఉద్యోగాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ముగింపు సందేశంలో కేరళ ఎడ్యుకేషన్ ఫోరం ప్రతినిధి పద్మనాభన్ చంద్రోత్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యా రంగంలో మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో విద్యాసంస్థలను మూసివేసి పట్టణాల్లో మెగా క్యాంపస్‌లను ప్రోత్సహించడం విద్యా అసమానతలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ అసెంబ్లీలో ‘విశాఖపట్నం డిక్లరేషన్–2026’ను విడుదల చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన డిక్లరేషన్‌ను జన విజ్ఞాన వేదిక స్కూల్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ కన్వీనర్ జి.గిరిధర్, ఉన్నత, సాంకేతిక విద్యకు సంబంధించిన డిక్లరేషన్‌ను జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ సమర్పించారు. విద్యను సమానత్వం, నాణ్యత, ప్రజాస్వామిక విలువలతో ముందుకు తీసుకెళ్లే దిశగా ‘విశాఖపట్నం డిక్లరేషన్’ను అధికారికంగా ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)