బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమారికవలస గురుకులం కొనసాగింపు సమిష్టి విజయం

1 గంట క్రితం

1788349836340.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 10:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌‌ను ప్రభుత్వమే నిర్వహించాలి

  • ఆదివాసీ అధికార్‌ ‌రాష్ర్టీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు అప్పలనర్స

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : మారికవలస గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థుల కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగిన విషయమని, ఇది ఆదివాసీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన సమిష్టి విజయమని ఆదివాసీ అధికార్‌ ‌రాష్ర్టీయ మంచ్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స అన్నారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలోని ఏకైక గిరిజన గురుకుల ఇంగ్లీష్ మీడియం బాలుర పాఠశాలను మధ్యలోనే మూసివేసే, విద్యా స్థాయిని కుదించే ప్రతిపాదనల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ఆదివాసీ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలు సంఘటితమై చేసిన సుదీర్ఘకాలం పోరాటం ఫలితంగా ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య చాలా అరుదని తెలిపారు. ప్రజా ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గి ఆదివాసీ విద్యాభివృద్ధికి సానుకూల నిర్ణయం ఈ పాఠశాల విషయంలో తీసుకుందన్నారు. 480 మంది విద్యార్థులకు విద్య అందించాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఈ స్కూల్‌కు కూడా ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. తాము సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, కానీ దాని నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే నేరుగా చేపట్టాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించకూడదని అన్నారు. ఫిజిక్స్‌వాలాతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌‌లో పిపిపి కింద గిరిజన గురుకులం విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నామన్నారు. 2027 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామన్న మంత్రి నారా లోకేష్ ప్రకటనకు ప్రభుత్వ చర్యలు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఆదివాసీ ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధ, అణచివేత ధోరణులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిముడు చిన్నం నాయుడు, ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ వుమెన్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాంగు చిన్ని, ఆదివాసీ మహిళా సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సమాఖ్య, తల్లిదండ్రుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్