- వారి అండతోనే టిడిపి జెండా రెపరెపలు
- ఎన్‌ఆర్‌ఐ టిడిపి జాతీయ కమిటీ ప్రమాణస్వీకారంలో లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధికారంలోకి వచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐల కృషి మరువలేనిదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు.
టిడిపి కార్యాలయంలో ఎన్ఆర్ఐ టిడిపి జాతీయ కమిటీ కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం జరిగింది. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్, రిలేషన్స్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టిడిపి అధ్యక్షుడిగా పి గురురాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారు లేని దేశం లేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం స్వర్గీయ ఎన్టీఆర్ అని, రాజకీయాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు.
2024 ఎన్నికల్లో తొలిసారిగా 50శాతం స్థానాల్లో యువకులు గెలుపొందారని, వారిలో ఏడుగురు ఎన్ఆర్ఐలకు కూడా అవకాశం కల్పించింది టిడిపినే అని వివరించారు. గతంలో అమరావతి ఉద్యమానికి ఎన్ఆర్ఐలు మద్దతుగా నిలిచారని తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు 50 దేశాల్లో 200 పట్టణాల్లో ఎన్ఆర్ఐలు కార్యక్రమాలు నిర్వమించారని చెప్పారు. మీరు పనిచేసే కంపెనీలు ఏపీకి వచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తెలుగుజాతిని మొదటిస్థానంలో నిలబెట్టే బాధ్యత సమిష్టిగా తీసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ సభ్యత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ‘మై టీడీపీ యాప్’ తో అందరూ అనుసంధానం కావాలని తెలిపారు. ఏ దేశంలో పది మంది ఉన్నా ఎన్ఆర్ఐ పార్టీ కమిటీ ఉండాలని కోరారు. 2029 ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అనంతరం పార్టీ కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్ నిర్వహించి వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.
నిజం గెలిచింది: కొవ్వొలత్తులు వెలిగించిన లోకేష్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ రోజును నిరసిస్తూ లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో 53కొవొత్తులు బుధవారం వెలిగించారు. రాజకీయ దురుద్దేశంతో జగన్ కుట్రపూరితంగా పెట్టించిన తప్పుడు కేసులో చంద్రబాబు గారిని అర్ధరాత్రి వేళ అరెస్టు చేశారని లోకేష్ విమర్శించారు. 'నిజం గెలిచింది' నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారని తెలిపారు. తెలుగు ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యంలా తప్పుడు కేసుల నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని చెప్పారు.








కామెంట్‌లు (0)