- మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి-గుంటూరు : సామ్రాజ్యవాదం, ప్రపంచీకరణ అనైతిక చర్యలను ప్రతిబింబించే వికృత రూపమే ఎప్‌స్టీన్ ఫైల్స్ అని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. వ్యవస్థల వైఫల్యంపై సీనియర్ జర్నలిస్టు కృష్ణ కానూరి రచించిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ పుస్తకాన్ని శనివారం గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్ సమావేశ మందిరంలో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఆవిష్కరించారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు పుస్తక పరిచయం చేశారు. 1953లో జన్మించిన ఎప్‌స్టీన్ అమెరికా బహుళజాతి కంపెనీల కోసం కరేబియన్ దీవులలో, ఇతర అనేక చోట్ల చేసిన కార్యకలాపాలను ఈ పుస్తకం వివరిస్తుందన్నారు. అమెరికాలో బయటపడిన లక్షలాది ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ ఫైల్స్ కూడా ఒకటన్నారు. యుక్త వయస్సు బాలికలను లోబరుచుకొని, కరేబియన్ దీవులలో ఉంచటం.. ఆర్థికంగా, రాజకీయంగా పేరుమోసిన వారితో చర్చలు జరపటం, వారి కోసం అమ్మాయిలను ఎరగా వేయటం, వారిని బ్లాక్‌మెయిల్ చేయటం వంటి జగుప్సాకరమైన చర్యలకు ఈ పుస్తకం సాక్ష్యం అని తెలిపారు. బిల్ క్లింటన్, బిల్‌గేట్స్, ట్రంప్, ప్రిన్స్ ఆల్డూ వంటి ప్రపంచ ప్రముఖులు, మన దేశంలో అనిల్ అంబాని, హర్‌దీప్‌సింగ్ పూరి, దీపక్ చోప్రా వంటి ప్రముఖులు ఎప్‌స్టీన్‌తో ఉన్న అనుబంధం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ...పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అనైతిక చర్యలకు ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. గతంలో కార్మికుల శ్రమను దోచుకున్న పెట్టుబడిదారులు, ప్రస్తుతం ప్రజల సంపదను కొల్లగొట్టే స్థాయికి చేరారని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దీనిని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి బుక్‌హౌస్ గుంటూరు ఇన్‌ఛార్జి సతీష్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)