- ఎస్ఐఆర్ పేరుతో ఐదు కోట్ల ఓట్ల తొలగింపు
- 'ప్రమాదంలో ప్రజాస్వామ్యం' సదస్సులో లక్ష్మణరావు
ప్రజాశక్తి-నంద్యాల : కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కె. లక్ష్మణరావు విమర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన వారిపై ‘ఉపా’ చట్టం కింద అక్రమ అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధిస్తోందన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు 'జెన్ జీ' ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని కోరారు. ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ద్వితీయ జయంతి పురస్కరించుకుని నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ అధ్యక్షతన వహించిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా లక్ష్మణరావు మాట్లాడారు. సీతారాం ఏచూరి జీవితాంతం ప్రజా సమస్యలపై పోరాడుతూ మతోన్మాదానికి వ్యతిరేకంగా సెక్యులర్ శక్తులను ఏకం చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భావ ప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. విచారణ లేకుండా వేలాది మందిని జైళ్లలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెఎన్‌యు విద్యార్థి ఉమర్ ఖాలీద్ ఆరేళ్లుగా జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఉపా చట్టం కింద ప్రముఖ రచయిత సాయిబాబాను అరెస్టు చేసి, ఆయన మరణించే వరకూ జైలుకే పరిమితం చేశారన్నారు. జర్నలిస్టు ప్రబీర్ పుర్కాయస్థపై మోపిన అక్రమ కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. ఎస్‌ఐఆర్ పేరుతో దేశంలో ఇప్పటికే ఐదు కోట్ల ఓటర్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. కర్ణాటకలో కోటికి పైగా ఓట్లు తొలగిస్తే నటుడు ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో ‘చలో ఎలక్షన్ కమిషన్’ నిర్వహించారని గుర్తు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. సిబిఐ, ఇడి, ఐటి విభాగాలను వాడుకుంటూ ప్రతిపక్షాలపై ఒత్తిడి తెస్తున్నారని, శివసేన వంటి పార్టీలను చీల్చడమే కాకుండా.. తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీల నాయకులను కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. దేశంలో పెరిగిన నిరుద్యోగం, అసంతృప్తి ఫలితంగా రూపుదిద్దుకున్న 'జెన్ జీ' ఉద్యమం యువతలో ప్రశ్నించే ధైర్యాన్ని నింపిందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి. రమేష్ కుమార్ మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతూ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ. నాగరాజు, యేసురత్నం, నరసింహనాయక్, టి. రామచంద్రుడు, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)