సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం

2 గంటల క్రితం

anitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- హోం మంత్రి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసు అధికారులను ఆదేశించారు. డీజీపీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పోలీసు రేంజ్‌‌లు, ప్రత్యేక విభాగాల పనితీరును ఆమె సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 29,839 ఎకరాల్లో గంజాయి సాగు స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయించామని, పిట్-ఎన్డీపీఎస్ చట్టం కింద 131 మందిని నిర్బంధించి, రూ.10.18 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్తంభింపజేశామని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం 22 వేలకుపైగా పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక చర్యలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని, స్వతంత్ర సర్వేలో 72 శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దేశంలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా గుర్తించిందన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో శాంతిభద్రతలపై సమీక్షిస్తూ, సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనలకు ప్రామాణిక కార్యాచరణ విధానాలు (ఎస్‌ఓపీ) రూపొందించాలని, భూవివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు నిఘా, నివారణాత్మక పోలీసింగ్‌తోనే శాంతి భద్రతలను సమర్థంగా కాపాడవచ్చని స్పష్టం చేశారు. ఏలూరు రేంజ్‌లో గ్రామస్థాయిలో ఘర్షణల మ్యాపింగ్, శాంతి కమిటీల సమర్థ నిర్వహణ, విగ్రహాల రక్షణ వంటి చర్యలతో కుల ఘర్షణలు తగ్గాయని పేర్కొన్నారు. కర్నూలు రేంజ్‌లో ఫ్యాక్షన్ కార్యకలాపాలు పోలీసు పికెట్లు, నిరంతర నిఘా, కౌన్సెలింగ్ వంటి చర్యలతో అదుపులో ఉన్నాయని, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2016 నుంచి పెద్దఎత్తున మత ఘర్షణలు జరగకపోవడం నివారణాత్మక పోలీసింగ్ విజయమని అన్నారు. మహిళల భద్రత కోసం చేపట్టిన ‘శక్తి’ కార్యక్రమం ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామని మంత్రి తెలిపారు. శక్తి యాప్‌ను 1.55 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా 164 శక్తి బృందాలు పనిచేస్తున్నాయని, దాదాపు 900 ప్రమాదకర ప్రాంతాలను మరింత సురక్షితంగా మార్చామని వెల్లడించారు. అలాగే ఆపరేషన్ ట్రేస్ ద్వారా ఇప్పటివరకు 9,007 మంది గల్లంతైన మహిళలు, బాలికలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని తెలిపారు. లైంగిక నేరాల దర్యాప్తు పూర్తి చేసే శాతం 39.41 నుంచి 90.20 శాతానికి పెరిగిందని, మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల్లో వ్యవస్థీకృత దుష్ప్రచారంపై చర్యలను సమీక్షిస్తూ, 2024 జూన్ నుంచి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దుష్ప్రచారాలకు సంబంధించి 1,665 కేసులు నమోదు చేసి, వాటిలో 725 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. సహయోగ్ పోర్టల్ ద్వారా 12,653 అక్రమ వెబ్ లింకులను తొలగించామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్