- భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం
- రహదారిపైకి చేరిన వరద
- భయం గుప్పిట్లో ముంపు మండలాలు
ప్రజాశక్తి- యంత్రాంగం : ఎగువన కుండపోత వర్షాలు పడుతుండటంతో గోదావరి, శబరి ఉగ్రరూపం దాల్చాయి. వరద పోటు పెరిగింది. భద్రాచలం వద్ద 49.50 అడుగులకు నీటిమట్టం చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం నుంచి దిగువకు 10,62,240 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో పోలవరం జిల్లాలోని విఆర్.పురం, కూనవరం, ఎటపాక, చింతూరు వాసులు మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎటపాక మండలం నెల్లిపాక, తోటపల్లి, నందిగామ, మురుమూరు వాగుల్లో వరద నీరు భారీగా చేరి లోతట్టు పంట భూములు ముంపునకు గురయ్యాయి. భద్రాచలం-కూనవరం వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుమూరు వద్ద వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నెల్లిపాక-వీరాయిగూడెం, కన్నాయిగూడెం - గట్టుగూడెం గ్రామాల మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్.పురం మండలంలోని గోదావరి పరివాహక ప్రాంతాలైన వడ్డిగూడెం, శ్రీరామగిరి, కల్తునూరు, జీడిగుప్ప, పోచవరం గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ఇప్పటికే సన్నద్ధమయ్యారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. కాటన్ బ్యారేజీ 175 గేట్లను పైకిలేపి సముద్రంలోకి 5,36,467 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ఇన్ ఫ్లో మూడు లక్షల క్యూసెక్కుల వరకూ ఉందని, శనివారం ఉదయానికి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో నాలుగు లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగి సాగించేందుకు నదిపై ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గట్టు వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో, గంటి పెదపూడి, ఉడిమూడి లంక, అరిగెలవారి పేట, బూరుగులంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని పలు గ్రామాలను గోదావరి వరద చట్టుముట్టింది. కాజ్‌వేలు నీటమునగడంతో దాదాపు 35 గ్రామాలకు రాకపోకలు నిల్చిపోయాయి. పోలవరం స్పిల్‌వే వద్ద 31.700 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దా అదే పరిస్థితి నెలకొంది. 59 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
ఇసుక ర్యాప్‌లో చిక్కుకున్న 38 మందిని రక్షించిన అధికారులు
తెలంగాణలోని భద్రాచలం రామాలయ పరిసరాల్లోని స్లూయిజ్‌లను అధికారులు మూసివేశారు. దీంతో, బ్యాక్ వాటర్ ప్రభావం కనిపిస్తోంది. అన్నదాన సత్రం ముంపునకు గురవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్ల వద్ద ఇసుక ర్యాప్‌లో చిక్కుకున్న 38 మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం
ప్రభావిత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అత్యవసర సేవలకు అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, వి.ఆర్ పురం, జంగారెడ్డిగూడెంలో మొత్తంగా మూడు ఎన్డిఆర్‌ఎఫ్, మూడు ఎస్‌డిఆఫ్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. సహాయం, సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 లను సంప్రదించాలని కోరారు.
నేడు మోస్తరు వర్షాలు
దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్రల మీదుగా కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీంతో, శనివారం నాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.








కామెంట్‌లు (0)