సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

2 గంటల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐద్వా జాతీయ నాయకులు ఎస్. పుణ్యవతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ పేరుతో ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ నాయకులు ఎస్. పుణ్యవతి విమర్శించారు. గంజాయి, డ్రగ్స్ సులభంగా అందుబాటులో ఉండటంతో యువత మత్తు వ్యసనాలకు బానిసలవుతోందని, దాని ప్రభావంతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా కుప్పకూలుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సందర్భంగా ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐద్వా 16వ రాష్ట్ర మహాసభల సావనీర్ ను ఆవిష్కరించారు. అనంతరం పుణ్యవతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలపై హింస, అత్యాచారాలు, గృహహింస, వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు. మహిళల భద్రతకు చట్టాల అమలుతో పాటు సామాజిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాల వినియోగం పెరగడం వల్ల మహిళలు, చిన్నారులపై నేరాలు కూడా అధికమవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముఖ్యమంత్రి చందబ్రాబు చేస్తున్న వ్యాఖ్యలు మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, నిర్ణయ హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు. మహిళలను కేవలం సంతానోత్పత్తి సాధనంగా చూడకుండా, వారి విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యత ఇచ్చే విధానాలను అమలు చేయాలని కోరారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించాలని, విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి సావిత్రి, నాయకులు రమాదేవి, మస్తాన్ బీ, శ్యామల, సత్యవతి, పూర్ణ, ప్రభావతి, శ్రీనివాస కుమారి తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్