- తొలి త్రైమాసికంలో జివిఎలో స్థానం కరువు
- వృద్ధి మొత్తం మత్స్య, పశుసంపదతోనే
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. స్థూల విలువ జోడింపులో కీలకంగా ఉండే వ్యవసాయం ఒక్క రూపాయికూడా విలువ జోడింపు చేయలేకపోయింది. మొత్తం వ్యవసాయ రంగంలో మత్స్య, పాడిపరిశ్రమ రంగాల్లో కొంతవరకు పుంజుకోవడంతో తొలి త్రైమాసికంలో జీవీఏ లో పెరుగుదల కనిపించింది. పరిశ్రమ, సేవ రంగాల్లో కూడా కొద్ది వృద్ధి కనిపించింది. కలెక్టర్ల సదస్సులో ప్రణాళికశాఖ అధికారులు సమర్పించిన నివేదిక వ్యవసాయంలో ఆందోళనను స్పష్టం చేసింది. దీనిపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ జివిఎ, జిఎస్‌డిపి తక్కువగా ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రధానంగా వ్యవసాయంపై దృష్టి పెట్టాలని చెప్పారు. తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగం జివిఎ సున్నాగా నమోదైంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు అధికారులు సిఎం దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాలు మాత్రం 71,087 కోట్లు జీవీఏ చూపించగా గతేడాదికంటే ఇది 14.19 శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. ఇందులో మత్య్స, ఆక్వా రంగాల్లోనే 23.71 శాతం వృద్ధి నెలకొంది. పాడి రంగంలో కూడా పది శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది అతివృష్టి ఈ ఏడాది అనావృష్టి కారణాలతోనే వ్యవసాయం ద్వారా విలువ జోడింపు జరగలేదని అధికారులు చెబుతున్నారు. 2026–27 తొలి త్రైమాసికంలో ఈ రంగం జివిఎ 24,976 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో 20,187 కోట్లుగా ఉన్న విలువ జోడింపుతో పోలిస్తే 23.72 శాతం వృద్ధి నమోదైంది. రొయ్యల ఉత్పత్తి 31.77 శాతం పెరిగింది. 5.03 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 6.61 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అలాగే దేశీయ చేపల ఉత్పత్తి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 9.41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరి 13.36 శాతం వృద్ధి సాధించింది.
పశుసంపదలో పురోగతి
పశుసంపద రంగం 2025–26 తొలి త్రైమాసికంలోని 38,709 కోట్ల నుంచి 42,580 కోట్లకు జివిఎ పెరుగుదలతో 10 శాతం వృద్ధి నమోదైంది. మాంసం ఉత్పత్తి 6.65 శాతం పెరిగింది. 4.21 లక్షల టన్నుల నుంచి 4.49 లక్షల టన్నులకు చేరింది. గుడ్ల ఉత్పత్తి కూడా 674.50 కోట్ల నుంచి 709.24 కోట్లకు పెరిగి 5.15 శాతం వృద్ధి సాధించింది.ఇలాఉండగా పరిశ్రమల రంగంలో 14.81 శాతం వృద్ధి సాధించగా సేవారంగంలో 12.70 వృద్ధి నెలకొంది. మొత్తం మూడు రంగాల్లో జీవీఏ 3,44,832 కోట్లుగా గణించగా జిఎస్డీపీ 3,65,520 కోట్లుగా లెక్కించారు.








కామెంట్‌లు (0)