- ముఖ్యమంత్రికి ప్రజారోగ్య వేదిక లేఖ
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖ నగర పరిధిలోని ఎండాడలో ఎఐజి హాస్పిటల్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విలువైన ప్రభుత్వ భూముల ఎంఒయును, ఉత్తర్వుల నిబంధనలను ప్రజల ముందుంచాలని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఇటీవల మంత్రి నారా లోకేష్ ఎఐజి ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన నేపథ్యంలో ప్రజా ఆరోగ్య వేదిక ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. అందులోని అంశాలను వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు మీడియాకు శనివారం వెల్లడించారు. ప్రభుత్వ భూమి ప్రజల ఆస్తి.. అటువంటి భూమిని ఒక ప్రయివేటు కార్పొరేట్ ఆస్పత్రికి కేటాయించినప్పుడు ప్రభుత్వం, ఆ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి? సంస్థకు ప్రభుత్వం కల్పించిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఏమిటి? అందుకు ప్రతిగా ప్రజలకు అందే ప్రయోజనాలు ఏమిటి ? అనే విషయాలను ప్రజలు తెలుసుకునే హక్కు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో పైన పేర్కొన్న అంశాలను ప్రభుత్వం బహిర్గత పరచాలని కోరారు. విశాఖలో ఇప్పటికే అనేక కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నప్పటికీ అధిక చికిత్స ఖర్చులు, బిల్లింగ్, రోగులపై భారాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. పేదలకు ఉచిత, అందుబాటు ధరలో వైద్యం అందడం లేదని తెలిపారు. ఈ అంశాలపై ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు, విమర్శలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎఐజి ప్రాజెక్టులో బిపిఎల్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు నిర్దిష్ట శాతం ఉచిత లేదా భారీ సబ్సిడీతో కూడిన పడకలు, వైద్య సేవలు కేటాయించేలా చూడాలని, ఎన్‌టిఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ లబ్ధిదారులపై అదనపు, అన్యాయమైన ఆర్థిక భారం లేకుండా వైద్యం అందేలా చట్టబద్ధమైన ప్రజారోగ్య బాధ్యతలను ప్రభుత్వం ఒప్పందంలో భాగం చేయాలని కోరారు. ఆ బాధ్యతల అమలును పర్యవేక్షించేందుకు మానిటరింగ్ మెకానిజం ఏర్పాటు చేసేలా నిబంధనలు ఉండాలని, తీవ్రమైన ఉల్లంఘనలు జరిగితే ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ భూమి, రాయితీలు లేదా ప్రభుత్వ ఆరోగ్య పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరును ప్రభుత్వం సమీక్షించాలని కోరారు.








కామెంట్‌లు (0)