వైసిపి నాయకుల గృహ నిర్బంధం
ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి : నాలుగు రోజుల క్రితం తాడిపత్రిలో వైసిపి, టిడిపి మధ్య చోటు చేసుకున్న రాజకీయ వివాదం అనంతపురం జిల్లా కేంద్రాన్ని తాకింది. ఇటీవల తాడిపత్రిలో వైసిపి నాయకుడు కేశవరెడ్డిపై జరిగిన దాడికి టిడిపి నేతలే కారణమంటూ శుక్రవారం వైసిపి నిరసనకు పిలుపునిచ్చింది. వైసిపి జిల్లా కార్యాలయం నుంచి తాడిపత్రికి బయలుదేరుతున్న జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. తమ నాయకులను తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని వైసిపి నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం చేశారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్దకు పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆయన బయటకు రాకుండా ఉండేందుకు ఇంటి చుట్టూ కంచె వేశారు. ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున కేతిరెడ్డి ఇంటికి చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేశారు. పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన చేపట్టేందుకు వీల్లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.








కామెంట్‌లు (0)