- మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రెండేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చారని, లా అండ్ ఆర్డర్‌ను పూర్తిగా పడకెక్కించారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నడుస్తూ, ప్రజలకు నమ్మకం లేని వ్యవస్థగా మారిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్’ రాజ్యాంగం అమలవుతోందని అన్నారు. అధికార పార్టీ కార్యకర్త అయితే నేరాలకి, ఘోరాలకి లైసెన్స్ దొరికినట్టేనని అధికార పార్టీ భావిస్తోందని విమర్శించారు. పోలీసుల చేష్టలకి ప్రధానంగా మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాలే బలవుతున్నారని పేర్కొన్నారు. ఇచ్చాపురం నుంచి తడ దాకా, కుప్పం నుంచి మచిలీపట్నం దాకా ఏ పోలీస్ స్టేషన్‌లోనూ సామాన్యుడికి న్యాయం లేదని, ఎఫ్ఐఆర్ నమోదు కావాలన్నా స్థానిక టిడిపి ఎమ్మెల్యే లేదా నాయకుడి అనుమతి ఉండాల్సిందేనని తెలిపారు. బాధితులు స్టేషన్‌కు వస్తే, పోలీసులు వాళ్ల ఫిర్యాదు వినకుండా ఎమ్మెల్యే ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నిసార్లు చెప్పులు అరిగేలా తిరిగినా స్పందన కరువైందని పేర్కొన్నారు. నిందితులు అధికార పార్టీకి చెందిన వాళ్లయితే పోలీసుల కాళ్లు, చేతులు ఆడటం లేదని, కొందరు పోలీస్ అధికారులు వృత్తిపరమైన బాధ్యతలను విస్మరించి, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని మచ్చిక చేసుకుంటున్నారని విమర్శించారు. మహిళలకు రక్షణ కరువైతే మాట్లాడే దిక్కు లేదని హోం మంత్రి చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి హోంశాఖ నాకివ్వండి అని అడుగులు వేస్తున్నారే తప్ప, బాధితుల వేదన పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరులో మహిళపై నడిబజార్లో అమానవీయ కీచక పర్వం జరిగిందని, 2009లో బాధితులు సొంత డబ్బుతో వేసుకున్న బోర్ రిపేర్ చేసుకుంటే టిడిపి నేతలకు కప్పం కట్టాలని దాడికి పాల్పడ్డారని తెలిపారు. డివిజన్ ప్రెసిడెంట్ కి రూ.5 వేలు, సెక్రెటరీకి రూ.5 వేలు లంచం డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. లంచం ఇవ్వబోమంటే పశు ప్రవృత్తితో దాడి చేశారని అన్నారు. మున్సిపల్ ఏఈ జనాల సొమ్ముతో జీతం తీసుకుంటున్నారా లేక టిడిపి ఆఫీస్‌లో జీతం తీసుకుంటున్నారా చెప్పాలన్నారు. పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు బోరును కాంక్రీట్ వేసి పూడ్చేయాలని ఏఈ ఎలా చెప్తారని ప్రశ్నించారు. బాధితురాలి భర్త స్టేషన్ లో ఉండగానే, ఇంటికెళ్లి మహిళను, ఆమె కొడుకును తొమ్మిది మంది కొట్టారని, నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి, ఒంటిపై నూలుపోగు లేకుండా చేసినా పోలీసులు స్పందించకపోవడం దారుణమని తెలిపారు. స్థానిక ఆడవాళ్లు ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిపై దుస్తులు కప్పి కాపాడాల్సిన దుస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. జూలై 15న అంత ఘోరం జరిగితే, 16వ తేదీ సాయంత్రం ఎమ్మెల్యే చెప్తే గానీ ఎఫ్ఐఆర్ కట్టలేదని, బాధితురాలి కొడుకు ఎమ్మెల్యేకు వీడియో చూపిస్తే తప్ప, సిఐ గారు కేసు నమోదు చేయలేదని అన్నారు. వీడియోలు బయటకు వస్తే తప్ప కేసు కట్టలేని పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబును, టిడిపి ఎమ్మెల్యేలను నమ్ముకుని తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కాదంబరి జత్వాని కేసును ఉదాహరణగా తీసుకోవాలని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)