- ఫోరం అధ్యక్షులు ఎంవి శివారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఎపి ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ అధ్యక్షులు ఎంవి శివారెడ్డి కోరారు. ఫోరమ్ జనరల్ బాడీ సమావేశం అసెంబ్లీ ఆవరణలోని సమావేశమందిరంలో శనివారం నిర్వహించారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సభ్యులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యలైన మాజీ ప్రజాప్రతినిధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ సభ్యుల ఫించన్ రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో ఫించన్ పెంపుదల చేశారని,ఎపిలో సానుకూలంగా స్పందించి పెంచాలని కోరారు. ఎపి ఫోరమ్ ఉపాధ్యక్షులు జల్లి విల్సన్ మాట్లాడుతూ అఖిల భారత సర్వీసుల అధికారులకు వర్తించే తరహాలోనే ఎటువంటి మినహాయింపులు లేకుండా పూర్తి స్థాయి మెడికల్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య ఖర్చులు చేసిన అనంతరం రీయింబర్స్ కోసం ధరఖాస్తు చేసుకోవడం, వయోభారం, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అంతేకాకుండా మాజీ సభ్యులకు అందిస్తున్న మందులు ఇక నుంచి కొరియార్ ద్వారా ఇంటి వద్దకే అందించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు గ్రేడ్ 1 దేవాలయాల్లో ప్రోటోకాల్ దర్శనం కల్పించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ లో క్లాస్ 3 ప్రాతిపదికన నామ మాత్రపు రుసుంతో వసతి కేటాయించాలని కోరారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ మాజీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సి లకు తగిన గౌరవం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫోరం కార్యదర్శి పికె సుందరరావు, మాజీ ఎమ్మెల్యేలు డి.రాజగోపాల్, దారా సాంబయ్య, ఇసి సభ్యులు, మాజీ ఎంఎల్‌ఎ, ఎంఎల్‌సిలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)