- మంత్రికి ప్రజారోగ్య వేదిక లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జూనియర్, రెసిడెంట్ డాక్టర్లతో తక్షణమే చర్చలు జరిపి వారి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ప్రజారోగ్యవేదిక కోరింది ఈ మేరకు వైద్య,ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్ యాదవ్‌కు వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవి రమణయ్య, టి కామేశ్వరరావు శుక్రవారం లేఖ రాశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. నిరంతరం పెరుగుతున్న రోగులను జూనియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాల్టీ పిజిలు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు చూస్తున్నారని తెలిపారు. పెరిగిన పనిభారాన్ని పరిగణనలోకి తీసుకుంటే వారు లేవనెత్తిన సమస్యలు సమంజసం, న్యాయం అని తెలిపారు. ఏడు నెలలుగా ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ఇప్పటివరకు సంతృప్తికరమైన పరిష్కారం లభించలేదని వివరించారు. సమ్మె ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే ఎపి జూడా ప్రతినిధులతో అర్ధవంతమైన చర్చలు ప్రారంభించి వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం సకాలంలో నిర్మాణాత్మకంగా జోక్యం చేసుకోవడం వల్ల వైద్యుల న్యాయమైన సమస్యలు పరిష్కారమవుతాయని, రోగులకు నిరంతరాయంగా వైద్య సేవలు అందుతాయని తెలిపారు.








కామెంట్‌లు (0)