బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‌కన్నీళ్లే మిగిలాయి

2 గంటల క్రితం

రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది - మత్స్యకారుల కుటుంబాలకు కన్నీరే మిగిలింది ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:00 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల ఆశలు అడియాసలు

  • చనిపోయివుంటారని భావిస్తున్నట్లు త్రీమెన్‌ కమిటీ నివేదిక

  • రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేసిన ప్రభుత్వం

  • సాయం చాలదంటూ నిరసన

ప్రజాశక్తి- కలెక్టరేట్(విశాఖపట్నం) : విశాఖ జిల్లా గంగవరం సమీపంలో ఈ నెల నాలుగున బోటు బోల్తా పడిన సంఘటనలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు కన్నీళ్లే మిగిలాయి. రేపోమాపో రాకుండాపోతారా? అంటూ నాలుగు రోజులుగా ఎదురుచూసిన వారి ఆశలు అడియాసలయ్యాయి. కనుమరుగైన మత్స్య కారులంతా చనిపోయివుంటారని భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌‌కు త్రీ మెన్ కమిటీ బుధవారం నివేదిక ఇచ్చింది. నాలుగు రోజులు కావస్తున్నా వారి ఆచూకీ తెలియనందున ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ఈ నివేదిక నేపథ్యంలో మత్స్యకార కుటుంబాలు కన్నీటి సముద్రమయ్యాయి. మృతదేహాలైనా దొరుకుతాయో, లేదో, తమ వారి కడచూపైనా తమకు దక్కుతుందో, లేదో అని గుండెలవిసేలా విలపిస్తున్నారు. కుటుంబమంతా ఆధారపడిన మనిషికి రూ.10 లక్షలు వెల కట్టి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటే తమ బతుకులు సాగేదెట్లా? అంటూ నిస్సాహయంగా మత్స్యకార కుటంబాల సభ్యులు ప్రశ్నిస్తుంటే.. పరిహార చెక్కులు చేతిలో పెట్టిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మౌనంగా వెనుదిరగడం విమర్శలకు తావిస్తోంది. చెక్కుల అందజేత అనంతరం తిరుగుప్రయాణమైన అమాత్యులను మత్స్యకారులు అడ్డుకున్నా.. వారందరినీ పక్కకు తోసేసి సమాధానమివ్వకుండా మంత్రి జారుకున్నట్లు మత్స్యకారులు వాపోతున్నారు. సహాయక చర్యలను సకాలంలో చేపట్టలేదన్న విమర్శలు ఇప్పటికే మూటగట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పరిహారం విషయంలోనూ పరిహాసమాడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాగా మత్స్యకారుల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు విశాఖ వన్ టౌన్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ తెలియరాలేదని కోస్ట్ గార్డు కూడా సెర్చ్ నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ త్రీమెన్ కమిటీని మంగళవారం నియమించారు. విశాఖ పట్నం ఆర్‌‌డిఒ దిలీప్ చక్రవర్తి, హార్బర్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ఎసిపి చిట్టిబాబు, సహాయ కమిషనర్ సురేష్ కుమార్ తో ఏర్పాటైన ఈ కమిటీ పలు అంశాలను పరిశీలించి మైమేరకు నివేదిక ఇచ్చింది.

అన్వేషణ కొనసాగుతుంది : మంత్రి

సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఆరుగురు మత్స్యకారులు గల్లంతు కావడంతో వారి కుటుం బాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం అందజేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులైన రగుతుల లక్ష్మి, కె.మౌనిక, కె.నారాయణమ్మ, ఎ.లక్ష్మి, కె.దమయంతి, ఎం.మసేనమ్మలతో హార్బర్ మెకనైజ్డ్ బోటు అసోసి యేషన్ భవనంలో ఆయన మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన ఒక్కొక్క మత్స్యకారుల కుటుంబాలకు మత్స్య శాఖ నుండి రూ.5 లక్షల చొప్పున, సిఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.5 లక్షలు చొప్పున అందించినట్లు వివరించారు. మత్స్యకారుల గల్లంతుపై ప్రభుత్వానికి సమాచారం అందిన వెంటనే అధికారులను, కోస్ట్ గార్డ్ వారిని అప్రమత్తం చేసినట్లు, నేవల్, కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించకపోవడంతో బోటు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు, బోటు యజమాని కారి చిన్న ఇచ్చిన సమాచారం, కోస్ట్ గార్డ్ వారి నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఆ ఆరు కుటుంబాలకు పరిహారం అందించామన్నారు. బోటు మునిగిపోవడంతో నష్టపోయిన కారి చిన్న కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారుల కోసం అన్వేషణ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, లోకం మాధవి, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, ఎన్‌‌టిఆర్‌ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్, మార్కెటింగ్ ఫెడరేషన్ చైర్మన్ కె.బంగార్రాజు, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ వర్ధన్, ఆర్‌‌డిఒ దిలీప్ చక్రవర్తి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మంత్రిని అడ్డుకున్న మత్స్యకారులు

చెక్కుల పంపిణీ అనంతరం బయటకు కారులో వెళ్తున్న మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.10 లక్షలు సరిపోదని, అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి వారికి ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. పోలీసులు మత్స్యకారులను పక్కకు నెట్టేసి మంత్రిని పంపించారు. ఈ సందర్భంగా గల్లంతైన మత్స్యకారుల భార్యలు దమయంతి, లక్ష్మి, మౌనిక మాట్లాడుతూ తమ భర్తల ప్రాణాలకు రూ.10 లక్షలు విలువ కడతారా? అంటూ ప్రశ్నించారు. ఈ సాయంతో తమ పిల్లలను ఎలా చదివిస్తామని, తాము ఎలా జీవించాలని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారాన్ని పెంచాలని, తమ ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, పెన్షన్ కల్పించాలని, తమ పిల్లలను ప్రభుత్వమే చదివించాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్