- రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై ఉద్యోగ సంఘాలు
- సచివాలయంలో చర్చలు జరిపిన ప్రభుత్వం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులో ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాలు రాష్ట్రప్రభుత్వాన్ని కోరాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుపై ఉద్యోగ సంఘాలతో రాష్ట్రప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో శుక్రవారం చర్చలు జరిపాయి. సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సంఘాల నాయకులు పలు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు. ఉత్తర్వుల అమలులో ప్రతి దశకు తగిన సమయం కేటాయించాలని కోరారు.
ప్రమోషన్లపై విధించిన ఫ్రీజింగ్‌ను ఈ నెలలోనే ఎత్తివేయాలని, కారుణ్య నియామకాలపై ఉన్న నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగిని కొత్తగా ఏదైనా జోన్, జిల్లాకు కేటాయించిన సందర్భంలో ప్రస్తుత పోస్టులోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పరిష్కారం లేని సమస్యలను గుర్తించి, అవసరమైన సవరణల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. అమలుకు సంబంధించి తలెత్తే సమస్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు సచివాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల కోసం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ హడావుడిగా చేయడం, పదోన్నతులపై బ్యాన్ విధించడం సరికాదని పేర్కొన్నారు. తుది సీనియారిటీ జాబితాలను ఖరారు చేసే ముందు ఉద్యోగులకు కనీసం 15 రోజులపాటు అభ్యంతరాలు సమర్పించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నాయకులు ప్రతిపాదించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎస్‌ఎస్ రావత్ తెలిపారు. ఈ సమావేశంలో ఎపిజెఎసి చైర్మన్, ఎపిఎన్జీవో సంఘం రాష్ర్ట అధ్యక్షులు ఏ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్, ఎపి అమరావతి జెఎసి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పి దామోదర్, ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్, ఎపిఎన్‌జివో సంఘం ప్రధాన కార్యదర్శి డివి రమణ, ఎపిటిఎఫ్ అధ్యక్షులు జి హృదయరాజు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీరామిశెట్టి వెంకట రాజేష్ , ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు టివి ఫణి పేర్రాజు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)