- సంస్మరణ సభలో బొత్స సత్యనారాయణ
ప్రజాశక్తి – ప్రత్తిపాడు(కాకినాడ జిల్లా) : కాపు సామాజిక తరగతి హక్కుల కోసం, ఆశయాల కోసం నిలబడిన గొప్ప వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని వైసిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ సంస్మరణ సభను మాజీ మంత్రి తోట నరసింహం అధ్యక్షతన అభిమానులు శనివారం నిర్వహించారు. పార్టీలకతీతంగా ఈ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ...మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం అందరికీ తీరని లోటన్నారు. దశాబ్దాలుగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన నేత అని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజా సేవ చేశారని కొనియాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల కోసం పలుమార్లు నిరాహార దీక్షలు చేపట్టారని, 2016లో కాపు గర్జన సభతో ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ పద్మనాభం కుమారులు ముద్రగడ గిరి, ముద్రగడ బాలు, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మాజీ ఎంపి వంగా గీత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి గణేష్, నల్ల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)