ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన కూటమి ప్రభుత్వం
వైసిసి అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యం నడుస్తోందని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని వైసిసి అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌ను మించిన ’జంగిల్ రాజ్’ నడుస్తోందని తెలిపారున గుంటూరు నుండి కుప్పం దాకా కీచక పర్వం సాగుతోందని, మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ సిబ్బంది అక్రమాలపై ప్రశ్నించినందుకు సొంత ఐటీడీపీ కార్యకర్త ’మంచోడు మణి’ కాలు నరికిన క్రూరత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల లైంగిక వేధింపులు, గుంటూరు, కుప్పం, ఏడు గుర్రాల బలి ఘటనలే రాష్ట్రంలో మహిళల రక్షణ కరువైందనడానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీలను, వారి తప్పులను ప్రశ్నిస్తే ఎవరినీ అంతం చూడకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్లుగా అరాచక పాలన సాగుతోందని అన్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై రెండు వేలకు పైగా అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపారని, భౌతిక దాడులు, గొడ్డలి పోట్లతో దారుణ హత్యలకు తెగబడుతున్నారని తెలిపారు. చివరకు ‘రెడ్ బుక్’ అరాచకం తమ సొంత పార్టీ ఐటీడీపీ కార్యకర్తలను కూడా కబళించే స్థాయికి దిగజారిపోయిందని అన్నారు. అత్యంత నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐటీడీపీ కార్యకర్త ’మంచోడు మణి’ పై వైసిపి ఎప్పుడు సంయమనం కోల్పోలేదని, భౌతిక దాడులు చేయలేదని తెలిపారు. కానీ, ఈరోజు అదే ఐటీడీపీ కార్యకర్త నారా లోకేష్ కేంద్రంగా జరుగుతున్న అవినీతిని, అసాంఘిక పనులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినందుకు.. అతనిపై కారుతో తొక్కిస్తూ సర్కస్ ఆడించారని తెలిపారు. అంతటితో కక్ష చల్లారక అతని కుడి పాదాన్ని నరికారని తెలిపారు. గుంటూరు నగర నడిబొడ్డున ఒక మహిళను వివస్త్రను చేసి టీడీపీ నేత మూర్తి కొడుతుంటే సమాజం తలదించుకోవాల్సి వస్తోందని అన్నారు. ఇంతకంటే ఆటవిక రాజ్యం, విశృంఖలత్వం, బరితెగింపు మరొకటి ఉండదని అన్నారు.








కామెంట్‌లు (0)