- తెలుగు భాష పరిరక్షణ
- వర్తమాన, సామాజిక సంక్షోభాలపై రచనలు
- ప్రజల ఐక్యతకు కవులు, *రచయితల కృషి ముమ్మరం
- సాహిత్య సమ్మేళనం ముగింపు సభలో వక్తల పిలుపు
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో : కవులు, రచయితలు విశాల సాహితోద్యమ నిర్మాణానికి పూనుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు తెలకపల్లి రవి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో, ఎంబివికె, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగింపు సభకు కుమారస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ.. యువ కవులు, రచయితలు స్వరాన్ని, గళాన్ని ఈ సమ్మేళనంలో వినిపించారన్నారు. అస్థిత్వ వర్తమాన, సామాజిక సంక్షోభాలను పట్టుకుని రచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనం సాహిత్య కారులకు వేదికగా ఒక చోటికి చేర్చి పాలకవర్గ భావజాలానికి వ్యతిరేకంగా తమ కలాలు, గళాలను వినిపించడానికి తోడ్పడిందన్నారు. యువ సాహిత్య కారులు, కళాకారులు ఒక ప్రధాన కర్తవ్యంగా రాజ్యాంగం చెబుతోన్న లౌకిక భావాలను రక్షించుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ.. వర్తమానంలో అనేక సవాళ్లు ఉన్నాయని, అందులో ప్రధాన మైనది ఎఐ విసురుతున్నదని పేర్కొన్నారు. సమాజంపై పెరుగుతున్న విద్వేష భావజాలానికి పాలక వర్గాల నిర్లిప్తత, క్రియా శూన్యత వల్ల గిరిజనులు, దళితులు, మహిళలు, అణగారిన వర్గాలకు సమస్యలు ఉత్పన్నమవ్వడంతో వాటికి వ్యతిరేకంగా కవులు, రచయితలు ముందుకు రావాలని కోరారు. నూతన తరానికి తెలుగు అక్షరాలు చదవడం, రాయడం రాని పరిస్థితి ఉందన్నారు. తెలుగు సాహిత్యానికి ఏర్పడిన ముప్పుగా ఉందని దీనిని ఒక సవాల్‌గా తీసుకొని తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. సిద్ధాంతాలకు కాలం చెల్లిందనేది వాస్తవం కాదని, ఆ సిద్ధాంతం కథా కవిత్వంలో ఎంతో నిర్మాణ చాతుర్యతను ఇమడ్చాలన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఖాదర్ మొహీయుద్దీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత పాలక వర్గాలు సమాజంలో అనేక చీలికలను తీసుకొస్తున్నాయన్నారు. ప్రజల ఐక్యతను సాధించడానికి కవులు, రచయితలు కృషి చేయాలన్నారు. ముగింపు సభకు అధ్యక్షత వహించిన కుమారస్వామి మాట్లాడుతూ.. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ రాజ్యాంగం చెప్పే ప్రజాస్వామ్య, లౌకిక భావాలకు విఘాతం కలిగిస్తోన్న పాలక వర్గాలపై కవులు, రచయితలు సమైక్యంగా రచనలు చేయాలన్నారు. ఎంబివికె ప్రధాన కార్యదర్శి పి మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ఈ సాహిత్య సమ్మేళనంలో రాష్ట్రంలో 27 జిల్లాల నుంచి కవులు, రచయితలు పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి సాహిత్య సమ్మేళనాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. ఎంబివికె యూట్యూబ్ చానల్ ద్వారా రచయితల ప్రసంగాలు, స్పందనలు, రచనలను ఆప్‌లోడ్ చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
ఆదివారం ఉదయం జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన జరిగిన నాలుగో సెషన్‌లో ‘తెలుగు కథ, సామాజిక చింతన’పై అట్టాడ అప్పలనాయుడు ప్రసంగించారు. ‘కవులు, రచయితలు, అధ్యయనం ఆవశ్యతక’పై ఆర్ సీతారాం మాట్లాడారు. ఐదో సెషన్‌లో సృజన కారుల స్వరం: మేమెందు రాస్తున్నాం? అనే కార్యక్రమానికి యువ రచయితలకు రాజాబాబు ఆహ్వానం పలకగా, ప్రగతి, ఉషారాణి సమన్వయం చేశారు. యువ రచయితలు అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుబ్బు ఆర్‌వి రచించిన ‘నా ఇజం’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. జంధ్యాల రఘుబాబు రచించిన ‘అక్షర కాంతులు’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఆవిష్కరించారు. రెండు రోజులపాటు జరిగిన సాహిత్య సమ్మేళనం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనంలో అనేక విషయాలు తెలుసుకున్నామని యువ రచయితలు వెల్లడించారు. వొర ప్రసాద్ వందన సమర్పణ చేశారు..








కామెంట్‌లు (0)