సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళా ఉద్యమం మరింత బలోపేతం

10 సెప్టెంబర్, 2026

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వర్ధంతి సభలో వక్తలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మహిళా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, ఆమె ఆశయ సాధనకు ఐక్యంగా పోరాడాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఐద్వా జాతీయ కమిటీ సమావేశం సందర్భంగా గురువారం ఉదయం విజయవాడ ఆటోనగర్లోని క్రాంతి రెసిడెన్సీలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన చిట్యాల ఐలమ్మ 41వ వర్థంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి ఐద్వా జాతీయ అధ్యక్షులు పి.కె.శ్రీమతి, జాతీయ ప్రధాన కార్యదర్శి కనినికా ఘోష్, జాతీయ నాయకులు సుభాషిణి అలీ, మరియం థావలే, ఎస్‌‌.పుణ్యవతి, మల్లు లక్ష్మి, సుధా సుందరరామన్, ఎపి అధ్యక్ష కార్యదర్శులు కె,శ్రీదేవి, వి. సావిత్రి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీమతి, కనినిక ఘోష్‌ ‌మాట్లాడుతూ ఐలమ్మ భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు, దోపిడీకి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా అన్యాయాన్ని ఎదిరించి పోరాడారని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళగా అప్పటి తీవ్రమైన సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ, తన హక్కుల కోసం వెనక్కి తగ్గకుండా పోరాటం చేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. భూమి కోసం, ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగిన పోరాటానికి ఆమె ప్రతీక అన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు ధైర్యంగా ముందుకు రావడానికి ఐలమ్మ జీవితం నేటికీ స్ఫూర్తినిస్తోందన్నారు. దేశంలో నేటికీ మహిళలు అనేక రకాల వివక్ష, హింస, ఆర్థిక దోపిడీ, అసమానతలను ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో చిట్యాల ఐలమ్మ వంటి ధైర్యవంతమైన నాయకత్వం, పోరాట స్ఫూర్తి మరింత అవసరమని వారు పేర్కొన్నారు. మహిళలపై హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, వరకట్నం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం వంటి సమస్యలపై మహిళలను ఐక్యం చేసి, హక్కుల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించడమే ఐలమ్మ అర్పించే నిజమైన నివాళని తెలిపారు. ఆమె స్ఫూర్తితో దేశవ్యాప్తంగా మహిళలను సంఘటితం చేసి ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం పోరాటాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్