- సమగ్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలి
- ఆరోగ్యం పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు
- ప్రజా ఆరోగ్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైద్య రంగ ప్రయివేటీకరణ, ఇన్సూరెన్స్ పథకాలు ప్రభుత్వ వైద్య వ్యవస్థకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కావని వక్తలు స్పష్టం చేశారు. ఆరోగ్యం మార్కెట్‌లో కొనుగోలు చేసే వస్తువు కాదని, అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని వారు పేర్కొన్నారు. బలమైన, సమగ్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయకుండా సార్వత్రిక ఆరోగ్య హక్కు సాధ్యం కాదని వారు పునరుద్ఘాటించారు. ప్రజలకు నాణ్యమైన, ఉచిత, అందుబాటు వైద్య సేవలను అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వైద్యం ప్రయివేటీకరణ, పర్యవసనాలు, పరిష్కారాలు పై ఎంబి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ కెవిఎస్ సాయిప్రసాద్ ఆధ్యక్షతన రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐఎంఎ ఎపి చాప్టర్ పూర్వ అధ్యక్షులు వి రామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు వైద్యంతో పాటు వ్యాధి నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.మద్యం, సిగరెట్లు, మాదకద్రవ్యాలను నియంత్రించాలని కోరారు. ఆరోగ్య సంరక్షణను సమగ్ర కార్యక్రమంగా రూపుదిద్దడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు కెవిఎస్ సాయిప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్లుగా ప్రభుత్వాలు తమ జిడిపిలో 5 నుంచి 6 శాతం ఆరోగ్యం కోసం కేటాయించాలన్నారు. ఇన్సూరెన్స్ కంటే ప్రజల ప్రత్యక్ష ఆరోగ్యంపై ఖర్చు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు సీతారామారావు మాట్లాడుతూ మందులు, వైద్యంతో పాటు రక్షిత మంచినీరు, పారిశుధ్యం, కల్తీ లేని ఆహారాన్ని ప్రభుత్వాలు సమకూర్చాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఎ.కొండూరులో కిడ్నీ బాధితుల కోసం నిర్వహించిన సర్వేల ఫలితంగా అక్కడ డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా నిలోఫర్ వంటి పిల్లల ఆసుపత్రి, ఎంఎన్ జె వంటి క్యాన్సర్ ఆసుపత్రి రాష్ట్రంలో లేవని, వాటిని వెంటనే నెలకొల్పాలని కోరారు. ఈ సమావేశంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావు ప్రవేశపెట్టిన ఎనిమిది తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆరోగ్య హక్కు చట్టం ప్రతి పౌరునికి నాణ్యమైన, సమానమైన వైద్య సేవలను చట్టబద్ధ హక్కుగా కల్పించాలని, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్వహణలో పిపిపి విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని,డబ్ల్యు హెచ్ ఒ సూచనల మేరకు ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని తీర్మానించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలను తక్షణమే పూర్తి చేసి, పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని, ప్రాథమిక స్థాయి నుంచి తృతీయ స్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు, పడకలు, మందులు పెంచాలని, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది తదితర అన్ని ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని తీర్మానించారు. ప్రభుత్వ ఆసుపత్రులల్లో మందులు, పరీక్షలు, శస్త్రచికిత్సలను పూర్తిగా ఉచితంగా అందించాలని, వ్యాధి నివారణ, పోషకాహారం, తాగునీరు, తల్లి,శిశు, మానసిక ఆరోగ్య రంగాలపై పెట్టుబడులు పెంచాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు వల్లూరు రామారావు, వైద్యులు అంకయ్య, వివిధ సంఘాల నాయకులు ఇ. విజయ్‌కుమార్, పి శ్రీనివాసరావు, కె సుబ్బరావమ్మ, డి రమాదేవి, ఎ మాల్యాద్రి, జి రామన్న,ఎ పున్నారావు, చంద్రశేఖర్, ఎం సూర్యారావు, పిఆర్ కె రెడ్డి తదితరులుమాట్లాడారు. బి లీల, జి దుర్గారావు, పి రాణి, పి రమేష్ చంద్ర తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.








కామెంట్‌లు (0)