వైసిపి రైతు విభాగ అధ్యక్షులు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మద్యం దొరికినంత సులభంగా ఎరువులు దొరకడం లేదని వైసిపి రైతు విభాగం అధ్యక్షులు ఎంవియస్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా మద్యం విచ్చలవిడిగా దొరుకుతోందని, పంటలకు కావలసిన ఎరువులు మాత్రం లభించడం లేదని మండిపడ్డారు. సాంకేతికత పేరుతో తెచ్చిన యాప్‌లు, ఓటీపీల నిబంధనలతో కౌలు రైతులను, సామాన్య రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం పొగాకు, ఆక్వా ఫీడ్, జ్యూస్ ఫ్యాక్టరీల కంపెనీలు బేఖాతరు చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని పేర్కొన్నారు. తక్షణమే రైతులకు ఎరువుల సరఫరాలో ఆంక్షలు తొలగించడంతో పాటు, తోతాపురి మామిడి, పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కడుపు మండిన అన్నదాతల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిన తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా వేధిస్తోందన్నారు. డెల్టా ప్రాంతాలలో 80 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని, ఎరువుల కొనుగోలుకు భూమి యజమాని ఫోన్‌కు ఓటీపీ వెళ్లే విధానాన్ని తీసుకురావడం వల్ల తీవ్ర గందరగోళం నెలకొందని తెలిపారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నించడం సరికాదని, సేంద్రీయ సాగు పేరిట రసాయనిక ఎరువులను తగ్గిస్తే దేశంలో తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందని అన్నారు.








కామెంట్‌లు (0)