భయంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయిన బాధితులు
సంఘటనపై సమగ్ర విచారణ జరపాలి : కెవిపిఎస్
ప్రజాశక్తి -మంగళగిరి (గుంటూరు జిల్లా) : ఒకవైపు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ పేరిట ప్రజలను ప్రాణంగా చూస్తామంటూ ఉపన్యాసాలు ఇస్తూనే, మరోవైపు రెల్లి, యానాది (ఎస్‌సి, ఎస్‌టి) సామాజిక తరగతులకు చెందిన వ్యక్తులపై దొంగతనం నేరం మోపి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి విమర్శించారు. రెండురోజుల క్రితం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని లక్ష్మీ నరసింహ కాలనీతో పాటు వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న రెల్లి, యానాది కులాలకు చెందిన ఏడు కుటుంబాల సభ్యులను దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై కమలాకర్, జె నవీన్ ప్రకాష్ , నాయకులు బూరగ వెంకటేశ్వర్లు, పల్లె కృష్ణతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా అప్పటికే వారు ఇంటికి తాళాలు వేసుకుని వెళ్లిపోయినట్లు గుర్తించి ఫోన్‌లో బాధితులను పరామర్శించారు.
బాధితులు తెలిపిన వివరాల మేరకు... ఓ ఇంటిలో బంగారు దొంగతనం జరిగిన నేపథ్యంలో తమను స్టేషన్‌కు తీసుకువచ్చారని, దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని తీవ్రంగా కొట్టడంతో కాళ్లు, చేతులు వాచిపోయాయని తెలిపారు. తమ బంధువుల వద్ద ఉన్న వారి సొంత బంగారాన్ని తీసుకువచ్చి దొంగతనం చేసిన బంగారంగా చూపించే ప్రయత్నం చేశారని వాపోయారు. అనంతరం మాల్యాద్రి మాట్లాడుతూ.. కులం, సామాజిక నేపథ్యంలో అనుమానితులుగా చూస్తూ రెల్లి, యానాది కులస్తులను తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకూ బాధితులకు కెవిపిఎస్ అండగా ఉంటుందని, అవసరమైతే ప్రజా సంఘాలను కలుపుకుని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)