ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక నిరసనలను అడ్డుకోవడం నిరంకుశమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ బుధవారం పలాస ఆర్‌డిఒ ఆఫీస్ వద్ద ధర్నాకు వెళ్తున్న రైతులను, గ్రామస్తులను వారి గ్రామాల్లోనే పోలీసులు ఆపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు ఆయా గ్రామాల్లోనే నిరసన తెలియజేశారని, అనేక ఆటంకాలను అధిగమించి ధర్నాకు వెళ్లాలని ప్రయత్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు ఇంకొంతమంది వామపక్ష నాయకులను కూడా ఆర్‌డిఒ ఆఫీస్ సమీపంలోనే పోలీసులు అడ్డగించడం నిరంకుశ చర్య అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ నెల 12న ఎయిర్‌పోర్టు ప్రభావిత బిడిమి గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో రైతులు, ప్రజలు తమ బతుకులను బుగ్గిపాలు చేసే ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను విరమించుకోవాలని ముక్తకంఠంతో ఆయనకు విన్నవించుకున్నారని వివరించారు. అయినా ప్రభుత్వం పునరాలోచించాల్సింది పోయి రైతులపై, నిరసనకారులపై నిర్బంధానికి పాల్పడ్డారని, వామపక్ష నాయకులను పోలీసులు గృహ నిర్బంధించారని తెలిపారు. ప్రజలు వద్దంటున్న కార్గో ఎయిర్‌పోర్టు ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని, ప్రజాస్వామిక నిరసనలపై నిర్బంధాన్ని విడనాడాలని శ్రీనివాసరావు కోరారు.







కామెంట్‌లు (0)