బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition సంఘ్ భావజాలం రాజ్యాంగ దృక్పథానికి విరుద్ధం

1 గంట క్రితం

proff niraja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 11:47 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఎన్‌ఆర్‌‌సి,సిఎఎ, ఎస్‌ఐఆర్‌ ‌వేర్వేరు కాదు

  • ఆర్‌ఎస్‌ఎస్‌ ‌లక్ష్యానికి అనుగుణంగా అడుగులు

  • సదస్సులో వివరించిన డాక్టర్‌ ‌నీరజ జయాల్‌

న్యూఢిల్లీ : భారతదేశంలో పౌరసత్వ చట్టాల్లో వస్తున్న మార్పులు క్రమంగా ‘‘అనుమానిత విదేశీయత’’ అనే దృక్పథం వైపు నడిపిస్తున్నాయని రాజకీయ శాస్త్రవేత్త, సిటిజన్‌‌షిప్‌‌ స్కాలర్‌ ‌డాక్టర్‌ ‌నీరజ జయాల్‌ ఆందోళనవ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ‘ఒక దేశం-ఒక ఎన్నిక, సమాఖ్యవాదం, పౌరసత్వం’ అనే అంశంపై జరిగిన సదస్సులో డాక్టర్‌ ‌నీరజ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం అనుసరించే విషపూరితమైన, అత్యంత అవినీతిమయమైన విధానాలు, పద్దతులను ఆమె ఎండగట్టారు. పౌరసత్వ చట్టం సవరణలు, ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష (ఎస్‌ఐఆర్‌), పాస్‌పోర్టులపై వ్యాఖ్యలు ఇవన్నీ వేర్వేరుగా కనిపించినా, అవన్నీ కలిసి ఒకే లక్ష్యం వైపు అడుగులువేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. భారత రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం రెండూ మొదట్లో ‘‘జన్మతః పౌరసత్వం’’ సూత్రాన్ని ఆమోదించాయని, అయితే క్రమంగా దీని నుంచి దేశం దూరమవుతోందన్నారు.

పౌరసత్వం నిరూపణయ్యే వరకూ విదేశీయుడేనా?

భారతీయులు తమ స్వంత దేశానికే చెందినవారని నిరూపించుకోవాలంటూ నెమ్మదిగా వారిని కోరుతున్నారా? ‌ భారతదేశ పౌరసత్వానికి సంబంధించిన మూల భావనపై . భారతదేశ పౌరసత్వానికి సంబంధించిన మూల భావన అంటే, మీరు ఈ దేశానికి చెందినవారేనని భావించడం నుండి పరాయివారు అన్న భావనకు నెమ్మదిగా మారడమేనని ఆమె వ్యాఖ్యానించారు. అంటే ఒక వ్యక్తి తన పౌరసత్వాన్ని నిరూపించుకునే వరకు ఆ వ్యక్తిని విదేశీయుడిగానే భావిస్తారా? అని ఆమె ప్రశ్నించారు. జన్మత: వచ్చిన పౌరసత్వం నుండి షరతులతో కూడిన పౌరసత్వానికి మారడం, అలాగే పౌరసత్వ చట్టానికి 2003, 2019ల్లో చేసిన సవరణల గురించి కూడా ఆమె తన ప్రసంగంలో వివరించారు. ఎన్‌ఆర్‌‌సి, ఎస్‌ఐఆర్‌, సిఎఎలు, ఇటీవల తలెత్తిన పాస్‌‌పోర్ట్‌ ‌వివాదం ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడివున్నాయో ఆమె తన ప్రసంగంలో వివరించారు. ఒకవేళ పౌరసత్వ నిరూపణ చేసుకోవాల్సి వస్తే ఆ భారం సామాన్యుడిపై ఎలా పడుతుంది, ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించాల్సి వుంటుందనే అంశాలు కూడా వివరించారు. 1946నాటి విదేశీయుల చట్టం, దాని వలసవాద వారసత్వాన్ని ప్రస్తావించారు. పౌరసత్వంతో ముడిపడిన సంక్షేమ పథకాలు, ఓటింగ్‌ ‌హక్కులు వంటి అంశాలను కూడా డాక్టర్‌ ‌నీరజ తన ప్రసంగంలో వివరించారు.

సావర్కర్‌ భావనపై ఆధారపడ్డ పౌరసత్వం..

పౌరసత్వం ఎవరికి ఉండాలి అనే ప్రశ్నపై ఆర్‌ఎస్‌ఎస్‌ దృక్పథం వి.డి. సావర్కర్ 1923 నాటి ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ రచనలో పేర్కొన్న ‘‘పుణ్యభూమి’’, ‘‘పితృభూమి’’ భావనపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ఈ దృక్పథం ప్రకారం, భారత్‌ను హిందూ మెజారిటీ దేశంగా, హిందూ రాజ్యంగా చూస్తారని, ముస్లింలు మాత్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందినవారని పరిగణిస్తారన్నారు. ఈ నేపథ్యంలో, 1955 పౌరసత్వ చట్టానికి 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం, 2019లో మోదీ ప్రభుత్వం చేసిన సవరణలు అత్యంత కీలకమైనవని వివరించారు.

1946 నాటి విదేశీయుల చట్టం ప్రకారం, ఎవరైనా వ్యక్తి తాను పౌరుడినని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుందని, ఇది వలస కాలం నాటి చట్టమని ఆమె గుర్తు చేశారు. దీనికి భిన్నంగా, 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఎవరైనా విదేశీయుడు అని అనుమానిస్తే, దాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎన్‌ఆర్‌‌సి, ఎన్‌పిఆర్‌, ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఈ మూడూ ఆ బాధ్యతను సామాన్య పౌరులపైకి, పొరుగువారిపైకి మార్చాయని, ఇది మధ్యప్రదేశ్ నుంచి బిహార్ వరకూ కొందరిపై నిఘా, వేధింపులకు దారితీసిందని, వీటి లక్ష్యంగా ఎక్కువగా మైనార్టీ ఓటర్లే మారారని ఆమె తెలిపారు.

సంక్షేమ పథకాలు హక్కుగా కాకుండా దానంగా చూసే ధోరణి పెరుగుతోందని, ఓటరు జాబితాలో పేరు ఉండటమే సంక్షేమ ప్రయోజనాలకు ప్రాతిపదికగా మారుతోందని పేర్కొన్నారు. పౌరసత్వ అంశం ఒంటరిగా కనిపించే అంశం కాదని, ఇది వివిధ రంగాల్లో జరుగుతున్న పరిణామాలతో ముడిపడి ఉందని, భారతదేశపు అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని రెండో తరగతి పౌరులుగా మార్చే దిశగా ఇవి కదులుతున్నాయని డాక్టర్‌ ‌నీరజ జయాల్‌ ఆందోళనవ్యక్తం చేశారు .


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్