తమిళనాడు సిఎంకు సిపిఎం విజ్ఞప్తి
చెన్నై : ఇనాం భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు సిపిఎం విజ్ఞప్తి చేసింది. పరిష్కారం కనుగొనడం కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన సిపిఎం రాష్ర్ట కార్యదర్శి పి. షణ్ముగం, పార్టీ నాయకులు ఒక వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పి షణ్ముగం విలేకరులతో మాట్లాడుతూ కరూర్ జిల్లాలో ఇనాం భూములపై ఆంక్షలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వును జారీ చేయడాన్ని స్వాగతించారు. ఆ భూములను ఆలయ భూములుగా తప్పుగా చిత్రీకరించడం వల్లే వాటి రిజిస్ట్రేషన్‌పై నిషేధం అమల్లో ఉందని అన్నారు. అలాగే, అన్ని ఇనాం భూములు ఆలయ భూములు కావని ఈ విషయంలో హిందుత్వ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి భూముల్లో నివసిస్తూ, సాగు చేస్తున్న ప్రజల సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ ముఖ్యమంత్రిని కోరిందని షణ్ముగం తెలిపారు. కరూర్ కు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు ఒక సాహసోపేతమైన ముందడుగు అయినప్పటికీ, తమిళనాడు వ్యాప్తంగా ఇలాంటి అనేక కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని షణ్ముగం గుర్తుచేశారు. అలాగే, కలక్కాడ్-ముండంతురై టైగర్ రిజర్వ్, శ్రీవిల్లిపుత్తూరు-మేఘమలై టైగర్ రిజర్వ్, కన్యాకుమారి జిల్లాలోని కొన్ని అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును షణ్ముగం ప్రస్తావించారు. ఆ తీర్పును "తీవ్రంగా ఖండించదగినది"గా అభివర్ణించారు.
ఈ ఉత్తర్వును అమలు చేయడంలో తమిళనాడు ప్రభుత్వం సహకరించకపోతే, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని మోహరించవచ్చని కేంద్రానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను కూడా ఆయన విమర్శించారు. ఇది "ప్రజా వ్యతిరేక వైఖరిని" ప్రతిబింబిస్తోందని ఖండించారు. తమ పార్టీ ఈ సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టులో సమీక్షా పిటిషన్ దాఖలు చేసి, అటవీ హక్కుల చట్టంలోని నిబంధనల అమలును వేగవంతం చేయాలని షణ్ముగం తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, రాష్ర్టంలో త్వరలో జరిగే ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే విషయంలో సిపిఎం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షణ్ముగం తెలిపారు.







కామెంట్‌లు (0)