డివైఎఫ్‌ఐ నాయకుడి *అక్రమ అరెస్టు
ఖండించిన వామపక్షాలు, కాంగ్రెస్
కొల్‌కతా :పశ్చిమ బెంగాల్‌లో ప్రశ్నించే గొంతుకలను బిజెపి ప్రభుత్వం అణిచేస్తుంది. బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలిక హత్యాచార ఘటనపై ప్రజలు ఆగ్రహించారు. నింధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్‌ఐ, ఇతర సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. అయితే, పోలీసులు నిర్భందించడంతో అల్లర్లు చెలరేగాయి. ఈ వీటికి ప్రేరేపించడానే ఆరోపణలతో డివైఎఫ్‌ఐ నాయకుడు మహమ్మద్ లహేక్ అలీని పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్టవిరుద్ధంగా గుమిగూడటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి తీవ్ర ఆరోపణలతో పాటు భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని 27 నిబంధనలు, ప్రభుత్వ ఆస్తుల నష్ట నివారణ చట్టం, ప్రజా భద్రతల పరిరక్షణ చట్టం, భారతీయ రైల్వే చట్టంలోని నిబంధనల కింద అలీపై కేసు నమోదు చేశారు. లహేక్ అలీని బరుయిపూర్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి ఎనిమిది రోజుల పోలీసు కస్టడీ విధించింది. అయితే ఈ అరెస్టు రాజకీయ ప్రేరేపితమని వామపక్షాలు ఖండించాయి. ‘ఈ అరెస్ట్ అధికార బిజెపి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్య. పోలీసులతో కలిసి ఆయన గుంపును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలలో స్పష్టంగా కనిపిస్తోంది . కానీ అధికార పార్టీ పోలీసుల్ని ఇటువంటి చర్యకు ఉసిగొల్పడం ద్వారా మా నాయకులలో భయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తోంది. విచారణ పూర్తికాకముందే ఒకరిని దోషిగా ప్రకటిస్తున్నారు. ఇది చట్టబద్ధమైన పాలన కాదు. ఈ విషయంలో టిఎంసిని బిజెపి అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది’ అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి విమర్శించారు. అలీ అరెస్టును కాంగ్రెస్ కూడా విమర్శించింది. ‘ లాహెక్ అలీ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలపడం ప్రజాస్వామ్యంలో ఒక సాధారణ విషయం. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అటువంటి గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజా నిరసనలకు బిజెపి ప్రభుత్వం భయపడుతోందని ఇది చూపిస్తుంది. ఆయనను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ తెలిపారు. బరుయిపూర్‌లోని ఖోదర్‌బజార్ నివాసి అయిన అలీ 2021, 2026 అసెంబ్లీ ఎన్నికలలో బరుయిపూర్ పశ్చిమ్ నియోజకవర్గంలో సిపిఎం నుండి పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు. ఎలాంటి నేర చరిత్ర లేదని కూడా ఆ అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు. అలాగే, రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు, స్థానికంగా మంచి పేరున్న ఆయనపై బిజెపి సర్కార్ అక్రమంగా కేసు బనాయించిందని స్థానికులు విమర్శిస్తున్నారు.







కామెంట్‌లు (0)