- ఇద్దరు యువకులు గల్లంతు..
- మరో ఇద్దరిని కాపాడిన స్థానికులు, పోలీసులు
ప్రజాశక్తి -కాకినాడ రూరల్ : కాకినాడ ఎన్‌టిఆర్ బీచ్‌లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన నలుగురు స్నేహితులు ఒక్కసారిగా అలల ఉధృతికి సముద్రంలో చిక్కుకుపోయారు. వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. మిగిలిన ఇద్దరినీ స్థానికులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిలో ఒకరి పరిస్థితి విషమం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్ నగర్‌కు చెందిన పడాల యువ కిషోర్, ఇంద్రపాలెం చీడిగ ప్రాంతానికి చెందిన అనుసూరి వీరబాబు, అనుసూరి శ్రీ గణేష్ సాయిరాం, కాదా ఆదిత్య వెంకట సందీప్ కుమార్ నలుగురు స్నేహితులు కలిసి ఎన్‌టిఆర్ బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి వెళుతుండగా అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు ప్రమాదంలో చిక్కుకున్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు తిమ్మాపురం పోలీసులకు సమాచారం అందించారు. శ్రీ గణేష్ సాయిరాం, సందీప్ కుమార్‌ను స్థానికుల సాయంతో పోలీసులు కాపాడారు. కిషోర్, వీరబాబు గల్లంతయ్యారు. ఒడ్డుకు తీసుకొచ్చిన యువకుల్లో శ్రీగణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం సముద్ర తీరంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.







కామెంట్‌లు (0)