తెలంగాణ : దక్షిణాఫ్రికాలో శిక్షణ విమానానికి ప్రమాదం చోటుచేసుకొన్న ఘటనలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన యువకుడు మృతి చెందాడు. మండల కేంద్రానికి చెందిన ఆడెపు చంద్రమోహన్ చిన్న కుమారుడు సుమంత్ (24) సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో రెండేండ్లుగా పైలట్ శిక్షణ పొందుతున్నాడు. (భారత కాలమానం ప్రకారం) శనివారం శిక్షణ పొందుతున్న విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలడంతో సుమంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వార్త అందుకున్న కుటుంబం, గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన ఆడేపు వరలక్ష్మీ–చంద్రమౌళిది మధ్య తరగతి కుటుంబం. వ్యాపార రీత్యా చంద్రమౌళి కుటుంబం హసన్‌పర్తిలో స్థిరపడింది. ఆయన పెయింట్స్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఆడేపు సుమంత్ కు పైలెట్ కావాలన్న కోరిక ఉంది. విమానాన్ని చూస్తూ.. ‘ఒకరోజు నేను కూడా ఈ విమానం నడుపుతా అమ్మా’.. అని చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ తమ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయంటూ ... సుమంత్ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సుమంత్ మృతదేహం ఇండియాకు పంపడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని దక్షిణాఫ్రికా అధికారులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారత ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకుని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
దక్షిణాఫ్రికాలో కుప్పకూలిన శిక్షణ విమానం - తెలంగాణ యువకుడు మృతి
29 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 01:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)