- పడిగాపులు కాచిన డిగ్రీ లెక్చరర్లు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : హడావుడిగా చేపట్టిన బదిలీల ప్రక్రియతో డిగ్రీ కళాశాలలు అర్ధరాత్రి వరకు పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. డిగ్రీ కళాశాలల లెక్చరర్ల బదిలీలకు అనుమతి ఇస్తూ ఈ నెల 2వ తేదిన రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. అయితే ఈ నెల 5వ తేది తరువాత బదిలీలు, పదోన్నతులపై బ్యాన్ ఉండటంతో ఆలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో శుక్రవారం బదిలీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్య కమిషనర్ శనివారం లోపు ఆప్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 162 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సుమారు 1600 మంది రెగ్యులర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరందరకూ కూడా బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చారు. వీరికి 4వ తేది రాత్రి 9 గంటలకు ఖాళీలతో పాటు లెక్చరర్లకు వ్యక్తిగత పాయింట్లు కూడా ఉన్నత విద్య వ్యక్తిగతంగా లింక్‌ల ద్వారా పంపింది. ఈ పాయింట్ల ఆధారంగా 5వ తేది(ఆదివారం) మధ్యాహ్నం 12గంటల నుంచి2 గంటల వరకు జోన్-1కు, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30వరకు జోన్-2, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటలకు జోన్-3, రాత్రి 7.30 నుంచి రాత్ 10 గంటల వరకు జోన్-4 వారికి వీడియో కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు ఉంటాయని కమిషనర్ 4వ తేది ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే ఆ కేటాయించిన పాయింట్లను మరలా ఆదివారం రద్దు చేశారు. ఈ పాయింట్లను మరలా పంపుతామని సుమారు రాత్రి 11 గంటల వరకు కౌన్సిలింగ్ జరిగే కళాశాలల వద్దే లెక్చరర్లను ఉంచేసింది. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన బదిలీల కౌన్సిలింగ్ రాత్రి 11 గంటల వరకు కూడా ప్రారంభం కాలేదు. అయితే ఎయిడెడ్ కళాశాలల లెక్చరర్ల సర్వీస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సర్వీస్ పాయింట్ల విషయంలో మార్పులు చేసే అంశంపై పాయింట్లను పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఎయిడెడ్ కళాశాలలను 2021లో ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో పాత సర్వీస్ కాకుండా 2021 సర్వీస్ ఆధారంగా కేటాయించే విధంగా ఉన్నత విద్య మార్పులు చేస్తునట్లు సమాచారం. పాత సర్వీస్ లెక్కలోకి తీసుకోకపోతే తమకు అన్యాయం జరుగుతుందని ఎయిడెడ్ లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








కామెంట్‌లు (0)