- అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎపి నుంచి 10 మంది ఎంపిక
- ఎపిటిడబ్లూ ఆర్ఇఐఎస్ కార్యదర్శి ఎం గౌతమి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల (ఇఎంఆర్‌ఎస్)కు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో గల ‘అమృత్ ఉద్యాన్’ సందర్శనకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రత్యక్షంగా కలిసే అవకాశం వారికి ఈనెల 15న వారికి లభించనుందని ఎపి గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ (ఎపిటిడబ్లూ ఆర్ ఇఐఎస్) కార్యదర్శి ఎం గౌతమి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ఇఎస్ టిఎస్) ఆధ్వర్యంలో ఈ పర్యటనను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల బృందం ఈనెల 13న విజయవాడ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరుతుందని తెలిపారు.15న రాష్ట్రపతి భవన్, ‘అమృత్ ఉద్యాన్’ను సందర్శించడంతోపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారని వెల్లడించారు. 16న న్యూఢిల్లీలోని పలు చారిత్రక, విద్యా, అధ్యయన ప్రాంతాలను విద్యార్థులు సందర్శిస్తారని తెలిపారు. ఈ పర్యటన ద్వారా దేశ రాజధానిలోని ప్రముఖ సంస్థలు, చారిత్రక ప్రదేశాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం 17న విద్యార్థుల బృందం న్యూఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి చేరుకుంటుందని తెలిపారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించేందుకు ఒక మహిళా ఎస్కార్ట్ ఉపాధ్యాయురాలు బృందంతో పాటు వెళ్తారని తెలిపారు. ఇలాంటి పర్యటనలు గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు నాయకత్వ లక్షణాలు, విద్యా ప్రగతి, సమగ్ర వికాసానికి దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా సమాజంపై విద్యార్థులకు మరింత మెరుగైన అవగాహన కలుగుతుందని తెలిపారు.








కామెంట్‌లు (0)