మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌..

1 గంట క్రితం

image-cmsosid194dws0jw35mlokwiv.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 09:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కొకాపేటలో రూ.1,800 కోట్ల లగ్జరీ ప్రాజెక్ట్‌

  • 65 అంతస్తుల రెండు టవర్లు

  • 450కిపైగా నివాసాలు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : దక్షిణాది రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లోకి ది ట్రంప్‌ ‌ఆర్గనైజేషన్‌ ప్రవేశించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌లో భారీ లగ్జరీ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌‌లో భాగస్వామ్యం అవుతుంది. ట్రైబెకా డెవలపర్స్‌, ఐరా రియల్టీ భాగస్వామ్యంతో కొకాపేట గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ‘ట్రంప్‌ టవర్స్‌ హైదరాబాద్‌’ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాయి. దక్షిణాదిలో తొలి ట్రంప్‌ బ్రాండెడ్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌గా దీనిని ఆయా కంపెనీలు ప్రకటించాయి. అక్టోబర్‌లో అధికారికంగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎరిక్‌ ట్రంప్‌ హాజరుకానున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రైబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేష్‌ మెహతా, ఐరా రియల్టీ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ నర్సి రెడ్డి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కోకాపేటలో నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 800 అడుగుల ఎత్తుతో 65 అంతస్తుల రెండు టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. రెండు టవర్లను 28వ అంతస్తులో ఏర్పాటు చేసే సస్పెండెడ్‌ స్కై బ్రిడ్జ్‌ అనుసంధానించనుందన్నారు. ఇందులో ప్రత్యేక క్లబ్‌, ఇతర లగ్జరీ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 3.5, 4 బిహెచ్‌‌కె ఇళ్లతో పాటు పెంట్‌హౌస్‌లు కలిపి 450కిపైగా నివాస యూనిట్లు ఉండనున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌ 2031 నాటికి పూర్తి కానుందన్నారు.

​ రూ.5 కోట్ల నుంచి ప్రారంభం..

ప్రాజెక్ట్‌లోని నివాసాల ప్రారంభ ధర సుమారు రూ.5 కోట్లుగా ఉండనుండగా, పెంట్‌హౌస్‌ల ధరలు రూ.18 కోట్ల వరకు ఉండనుందని వారు తెలిపారు. మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం సుమారు రూ.1,800 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్‌ ద్వారా కనీసం రూ.3,500 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు ట్రైబెకా డెవలపర్స్‌ వ్యవస్థాపకుడు కల్పేష్‌ మెహతా తెలిపారు.​ ప్రాజెక్ట్‌లో మొదట ప్రతిపాదించిన ఎనిమిది పెంట్‌హౌస్‌లలో నాలుగు ఇప్పటికే విక్రయమైనట్లు తెలిపారు. ఒకే కుటుంబం రెండు పూర్తి అంతస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కొనుగోలుదారుల నుంచి వచ్చిన డిమాండ్‌ నేపథ్యంలో మరో నాలుగు పెంట్‌హౌస్‌లను అందుబాటులోకి తీసుకురాగా అవి కూడా విక్రయమైనట్లు కంపెనీ వెల్లడించింది. గత 12 ఏళ్లలో ముంబయి, పూణె, గురుగామ్‌, నోయిడా, కోల్‌కతా వంటి నగరాల్లో ట్రంప్‌ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌లు ‌కొనసాగుతున్నాయి. కోకాపేట ప్రాజెక్ట్‌కు రేరా అనుమతులు లభించాయని కంపెనీ తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్