గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిద్యార్థి, యువజన సంఘాల ‘చలో లోక్ భవన్’ ఉద్రిక్తం

2 గంటల క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 12:17 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

  • నేటి విద్యాసంస్థల బంద్‌‌ను జయప్రదం చేయాలని పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నీట్‌ పేపర్‌ ‌లీకుకు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రదాన్‌ ‌రాజీనామా చేయాలని, ఢిల్లీలో జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసుల అమానుష దాడికి నిరసనగా బుధవారం విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన ఛలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విద్యార్ధి, యువజన సంఘాల నేతలను లోక్‌‌భవన్‌ ‌వైపు వెళ్లనీయకుండా చేసేందుకు విజయవాడ ఎంబివికె వద్ద నుంచి లోక్‌భవన్‌‌కు వెళ్లే రహదారులు అన్నింటిని పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి మూసి వేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌‌యు, యువజన సంఘాలైన డివైఎఫ్‌ఐ, ఎఐవైఎఫ్‌ తదితర సంఘాల నేతలతో పాటు విద్యార్థులు, యువత శ్రీ శ్రీ భవన్‌ ‌నుంచి మ్యూజియం రోడ్డు ,మహాత్మాగాంధీ రోడ్డు మీదగా లోక్‌ ‌భవన్‌‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని కలెక్టర్‌ ‌కార్యాలయం వద్ద బారీగేట్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్ధి, యువజన సంఘాల నేతలు బారికేడ్లపై నుంచి బందరు రోడ్డులోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో స్పెషల్‌ బ్రాంచ్‌ ‌పోలీసులు వారిని వెనక్కి నెట్టివేశారు. దీంతో అక్కడే బైఠాయించి దర్మేంద్ర ప్రదాన్‌ ‌రాజీనామా చేయాలని, రాష్ట్రంలోని టిడిపి, వైసిపి, జనసేన పార్టీలు ఈ అంశంపై స్పందిం చాలని డిమాండ్‌ ‌చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఈ దశలో సంఘానికి ఒకరు చొప్పున లోక్‌‌భవన్‌‌కు తీసుకువెడతామని పోలీసులు చెప్పారు. అయితే, ఆ తరువాత లోక్‌‌భవన్‌ ‌నుంచి అనుమతి లభించలేదని చేతులెత్తేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల నేతలు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్‌‌భవన్‌‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పలువురు నేతలు కింద పడిపోయారు. పోలీసులు వారిని ఎత్తుకుని వచ్చి మ్యూజియం రోడ్డులో వదిలిపెట్టారు.

నేటి విద్యాసంస్థల బంద్‌‌ను జయప్రదం చేయండి : నేతల పిలుపు

ఈ సందర్భంగా మాట్లాడిన విద్యార్థి, యువజన సంఘాల నేతలు నేడు (శుక్రవారం) జరగనున్న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఆయనకు ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండే అర్హత లేదన్నారు. లోక్ భవన్ కి వెళ్తున్న నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అనైతికం అన్నారు. .ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు మాట్లాడుతూ.. ఛలో పార్లమెంట్ సందర్భంగా డిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేసిన తప్పుకు జవాబుదారీగా ఉండాలని ప్రశ్నిస్తే క్రూరంగా వ్యవహరించడం హేయమైన చర్య పేర్కొన్నారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వంతో పాటు ప్రధాన ప్రతిపక్ష నేతలు కూడా నోరు మెదపడం లేదన్నారు. పిడిఎస్‌‌యు రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ. గత 14 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీకేజ్ అయ్యాయని చెప్పారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగందర్ మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. మీడియాతో మాట్లాడిన అనంతరం మరో రోడ్‌ ‌మార్గాన లోక్‌‌భవన్‌ ‌వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ​విద్యార్థి, యువజన సంఘాల నేతలు మరోరోడ్డు మార్గాన లోక్‌‌భవన్‌ ‌ ముట్టడికి ప్రయత్నించారు. దారి మళ్లించి పరిగెత్తి మరో రోడ్ ద్వారా బందర్ రోడ్ మార్గాన లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో మరో సారి భారీ ఎత్తున అడ్డుకున్నారు. ఈ కార్యక్రమం లో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రవి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి, నాగ భూషణం, పిడిఎస్‌‌యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుభాని, పిడిఎస్‌‌యు రాష్ట్ర నాయకులు నరేంద్ర, ఎఐఎఫ్డిఎస్ నాయకులు కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేశ్వరరావు, షణ్ముఖ, ప్రణీత, దీరజ్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్