దూరంగా అధికార పక్షం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా వైసిపి ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి మాధవరావు నుంచి మూడు సెట్ల నామినేషన్ దాఖలయ్యాయని ఛైర్మన్ కె మోషేను రాజు వెల్లడించారు. వరుదు కళ్యాణి, టి కల్పలత, ఎస్ మంగమ్మ ప్రతిపాదించిన నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం మాధవరావను ఛైర్మన్ స్థానంలోకి తీసుకురావాలని అన్ని పార్టీలను కోరారు. అయితే ఈ ఎన్నిక సమయంలో కూటమికి చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు సభలో నుంచి బయటకు వెళ్లిపోయారు. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసిపి ఎమ్మెల్సీలు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బి గోపిమూర్తి, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు.. మాధవరావును ఛైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సభ్యులందరూ తుమాటిని అభినందించారు. ఆ తార్వత మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సమ దృష్టిలో చూడాలన్నారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో, రాష్ట్రంలో చట్టసభలు ఏర్పాటైన తరువాత ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. నిబంధనలు, నియంత్రణలు గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారని చెప్పారు. సభపై, కార్యక్రమాలపై ఎలాంటి గౌరవం ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రామసుబ్బారెడ్డి, కుంభా రవిబాబు, రామచంద్రారెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం, బొమ్ము ఇజ్రాయిల్, అరుణ్‌కుమార్, సూర్యనారాయణరావు, దువ్వాడ శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్, వంకా రవీంద్ర నాథ్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, కల్పలతా తదితరులు కూటమి తీరును తప్పుబట్టారు.








కామెంట్‌లు (0)