ప్రజాశక్తి-తిరుపతి: కిడ్నాప్ కేసులో ఇద్దరు నిందితులను తిరుపతి రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.1.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 316/2026 కిడ్నాప్ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్‌కు సంబంధించిన రూ.6 కోట్ల హవాలా వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చిక్కసంద్రకు చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సినిమాను తలపించే రీతిలో రూ.20 నోటు సీరియల్ నంబర్ చూపిస్తే డబ్బు అందజేస్తారని ఓ నార్త్ ఇండియన్ వ్యక్తి బాలాజీకి చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో బాలాజీ మూడు దఫాలుగా రూ.98 లక్షలు, రూ.98 లక్షలు, రూ.30 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో రూ.8 లక్షలు కమిషన్‌గా తీసుకుని, మిగిలిన రూ.2.18 కోట్లను అప్పగించినట్లు గుర్తించారు.
తిరుపతి తాటితోపునకు చెందిన జ్ఞానచందు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పీలేరులో జరిగిన వివాహ కార్యక్రమానికి వచ్చిన సమయంలో హవాలా సొమ్మును తన ఇంట్లో దాచిపెట్టి, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా హైదరాబాద్ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొబైల్ లావాదేవీల ఆధారంగా కటారి మోహన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. జ్ఞానచందు ఇంట్లో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుపతి రూరల్ పోలీసులు తెలిపారు. కేసులో మరికొంతమంది నిందితులను అరెస్టు చేసే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యాచారి వెల్లడించారు.








కామెంట్‌లు (0)