ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనూతన విద్యా విధానం, ఎన్‌‌టిఎపై ఐక్య ఉద్యమాలు

4 రోజుల క్రితం

press-
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఎఐఎస్ఎ జాతీయ అధ్యక్షురాలు నేహ బోరా

ప్రజాశక్తి-ఎన్‌‌టిఆర్ జిల్లా ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం, ఎన్‌టిఎ పరీక్షల నిర్వహణ లోపాలు, పేపర్ లీకేజీల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత తీవ్రంగా నష్టపోతున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ) జాతీయ అధ్యక్షురాలు నేహ బోరా ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతామన్నారు. 'జెన్ జీ రైజింగ్ ఇండియా టూర్' భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేసిన ఆమె, బుధవారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్నారు. పేపర్ లీకేజీలు, నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాము చేసిన 23 రోజుల నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు సరికొత్త ఊపునిచ్చిందన్నారు. ఉద్యమం జరుగుతుండగా, బిజెపి, ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని రాజకీయ ప్రయోజనాలకోసం నిరాహార దీక్షలో కూర్చున్న తమపై ప్రభుత్వ పెద్దలు విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని విమర్శించారు. ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు మత, సాంస్కృతిక అంశాలతో ఉద్యమ వాతావరణాన్ని కలుషితం చేశారని పేర్కొన్నారు. మహిళలు, దళితులు, మైనర్లపై కేసులు నమోదు చేయటంతో నిరాహార దీక్ష కేవలం మంత్రి రాజీనామా కోసం కాదని, పూర్తి భావజాలాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చామని చెప్పారు. విభజన రాజకీయాలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరించటం దారుణమన్నారు. ఈ వ్యవస్థను సమూలంగా పెకలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో సామాన్యుల సమస్యలను పక్కనబెట్టి, కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. సమాజంలో కులం, మతం, లింగం పేరిట యువతను విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని, విద్య, ఉపాధి, ఆత్మగౌరవం కోసం అందరూ ఐక్యంగా నిలబడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఉపాధ్యాయ నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఐజెయు కార్యవర్గ సభ్యులు కూన అజయ్ బాబు సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, ఎపియుడబ్ల్యుజె విజయవాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్