- ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి
ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి : ఏలూరు గ్రామాల్లో రాజకీయ, ఆర్థిక పెత్తందారులను ఎదిరించేందుకు ఐక్య ఉద్యమాలు మరింత బలోపేతం చేయాలని ఎపి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎపి రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలో కామ్రేడ్ వై.జోయ, కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి వేదికపై ఆదివారం ఆయన ప్రసంగించారు. తొలుత కార్యదర్శి నివేదికపై సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంఘాలు గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యతను చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎపి రైతు సంఘం నిర్మాణాన్ని మరింత విస్తృతం చేయాలని, పేద, మధ్య తరగతి, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వృత్తుదారులను కలుపుకొని గ్రామీణ శ్రామికవర్గ ఐక్యత సాధించాలని పిలుపునిచ్చారు. బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేశారు. 22 ఎ, ఇనాం, దేవాలయ భూములు, అటవీ భూముల సమస్యల పోరాడాలన్నారు. ‘మా భూమి-మా హక్కు’ పేరుతో రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, ఎరువుల ధరల పెరుగుదల, బ్యాంకు రుణాలు లభించకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల ప్రైవేటీకరణ, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. భవిష్యత్తులో విశాల ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అమరులైన ఉద్యమ నేతలకు సంతాపం
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభ పలువురికి సంతాపం తెలిపింది. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సూర్యనారాయణ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతినిధులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బడా సుబ్బారెడ్డి, రైతు సంఘం సీనియర్ నాయకులు, ఎఐకెఎస్ మాజీ సభ్యులు వై.జోయలకు సభ్యులు నివాళులర్పించారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్, కొడియరి_బాలకృష్ణ, ఎఐకెఎస్ జాతీయ నాయకులు ఎన్.శంకరయ్య, కామ్రేడ్ మల్లు స్వరాజ్యం, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సునీల్ చోప్రా, నేపాల్ ఘట్టాచార్య, దేబంజన్ చక్రవర్తి, మదన్ ఘోష్,__ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా_కార్మిక రైతాంగ ఉద్యమ నాయకులు రుద్రరాజు సత్యనారాయణరాజు, వలవల శ్రీరామమూర్తి, చింతకాయల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జిలతోపాటు పలువురు నాయకులను స్మరించుకున్నారు.
అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధంలో ఇరాన్ లో మరణించిన విద్యార్థులకు, ప్రజలకు, వెనిజులా భూకంపంలో మరణించిన ప్రజలకు, పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టులకు, విశాఖ ఉక్కు పరిశ్రమ, వివిధ పరిశ్రమలలో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు, ప్రభుత్వ విధానాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు రాష్ట్ర మహాసభ సంతాపం తెలియజేసింది.








కామెంట్‌లు (0)