మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజకీయ అణచివేతకు పోలీసుల వినియోగం

05 జులై, 2026

YCP rallies across the state tomorrow: Y.S. Jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మాజీ సిఎం వైఎస్‌ జగన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూటమి ప్రభుత్వం రాజకీయ అణచివేత కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తోందని వైసిపి అధినేత, మాజీ సిఎం వైఎస్‌ ‌జగన్‌ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రశ్నించే గొంతులను అణిచివేసే విధంగా పోలీసు వ్యవస్థను నడుపుతున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్‌ ‌వేదికగా వెల్లడించారు. కాకినాడ జిల్లా తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నెలరోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ లభించలేదని, బాధిత కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. ఇలాంటి ఘటనల్లో దర్యాప్తు ఆశించిన వేగంతో జరగడం లేదని విమర్శించారు. అలాగే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదు నమోదు చేయడంలో జాప్యం జరిగిందని, నిందితులపై సత్వర చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ, ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం చేయడమే కాకుండా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయలేదని, బాధితులపైనే ఎదురు కేసులు నమోదు చేయడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సాయికృష్ణ లాకప్ మరణం, క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, గంగమ్మ, తిరుపతమ్మల కస్టడీ మరణాలు, కళావతి ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని ఆరోపించారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు, యూట్యూబర్లపై నమోదవుతున్న కేసుల విషయంలోను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యూట్యూబ్ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు, యూట్యూబర్ రావణ్‌పై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ, చట్ట ప్రక్రియలను ఉల్లంఘించి చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్